ఎంచక్కా నడిపించే సైకిల్‌!

హాయ్‌ నేస్తాలూ...! బాగున్నారా.. ‘హాయ్‌బుజ్జీ’ నుంచి మీకో ప్రశ్న...!! సైకిల్‌ మనల్ని నడిపిస్తుందా...?! ‘అయ్యో... ఇదేం ప్రశ్న... సైకిల్‌ ఉన్నదే నడకను తప్పించడానికి కదా!’ అని అంటారేమో.

Updated : 11 Oct 2023 04:29 IST

హాయ్‌ నేస్తాలూ...! బాగున్నారా.. ‘హాయ్‌బుజ్జీ’ నుంచి మీకో ప్రశ్న...!! సైకిల్‌ మనల్ని నడిపిస్తుందా...?! ‘అయ్యో... ఇదేం ప్రశ్న... సైకిల్‌ ఉన్నదే నడకను తప్పించడానికి కదా!’ అని అంటారేమో. మళ్లీ కాసేపు ఆలోచించి.. ‘ఓ... అవును.. అవును.. ఇప్పుడు మాకర్థమైంది. సైకిల్‌ చైన్‌ పడిపోయినప్పుడో, టైర్‌లో గాలి పోయినప్పుడో, ఇలా ఇంకేదైనా రిపేర్‌ వచ్చినప్పుడో... మనల్ని అది నడిపిస్తుంది కదా!!’ అని సమాధానమిస్తారేమో! మీరలా జవాబు చెబితే మాత్రం తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే... ఆశ, దోశ, అప్పడం, వడ.. అన్నీ ఇక్కడే చెప్పేస్తారా ఏంటి? ఈ కథనం చదివేయండి.. మీకే అర్థమవుతుంది!!

ఇదో ‘వీల్స్‌ ఆన్‌ ట్రెడ్‌మిల్‌’!... ‘ఇంతకుముందేమో.. సైకిల్‌ అన్నారు.. నడిపించడం అన్నారు. మళ్లీ ఇదేంటి.. వీల్స్‌ అంటూ... ట్రెడ్‌మిల్‌ అంటూ... గందరగోళానికి గురిచేస్తున్నారు. మాకైతే ఏమీ అర్థం కావడం లేదు’ అని బుంగమూతి పెట్టకండి ఫ్రెండ్స్‌! ఈ సైకిల్‌నే ‘వీల్స్‌ ఆన్‌ ట్రెడ్‌మిల్‌’ అని పిలుస్తారు. వ్యాయామం చేస్తున్నప్పుడు నెదర్లాండ్స్‌కు చెందిన బ్రుయిన్‌ బెర్గ్‌మీస్టర్‌ అనే వ్యక్తి మదిలో మెదిలిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ విచిత్ర సైకిల్‌. దీనికి చైన్‌, పెడల్స్‌ ఉండవు. ‘తొక్కేందుకు పెడల్స్‌, చైన్‌ లేకుండా ఇది ఎలా నడుస్తుందబ్బా?’ అనే మరో సందేహమూ ఈ పాటికే మీ చిట్టి బుర్రలో మొలకెత్తి ఉంటుంది కదూ! నిజానికి ఇది ఓ ఎలక్ట్రిక్‌ సైకిల్‌!!

ఛార్జింగ్‌తో రయ్‌.. రయ్‌!

‘సైకిల్‌ అన్నారు. తొక్కడం ఉండదు.. ఇదే మనల్ని నడిపిస్తుంది అన్నారు. వీల్స్‌ ఆన్‌ ట్రెడ్‌మిల్‌ అని కూడా అన్నారు. పెడల్స్‌, చైన్‌ ఉండవన్నారు. ఇప్పుడేమో ఎలక్ట్రిక్‌ అని చెబుతూ.. షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు’ అని మీరంతా అనుకుంటున్నారు కదూ! ఇన్ని ప్రత్యేకతలు, ట్విస్ట్‌లు ఉన్నాయి కాబట్టే ఈ వింత సైకిల్‌ విశేషాలను మనందరి నేస్తం ‘హాయ్‌బుజ్జీ’ మీ ముందుకు తీసుకువచ్చింది.

ఆలోచనతో అంకురార్పణ...

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు... బ్రుయిన్‌ బెర్ట్‌మీస్టర్‌ అనే అంకుల్‌కు కొన్ని సంవత్సరాల క్రితం సైకిల్‌, ట్రెడ్‌మిల్‌ రెండూ కలగలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. దాని ఫలితమే ఈ ‘లోపిఫిట్‌’. ‘‘మళ్లీ.. లోపిఫిట్‌ ఏంటబ్బా!’’ అనుకోకండి? ఎందుకంటే ఈ సైకిల్‌ను ఇలా కూడా పిలుస్తారు మరి. ఇలా.. పేర్లు ఎన్ని ఉన్నా... ఈ వింత సైకిల్‌ మాత్రం నెదర్లాండ్స్‌లో జనాలను భలే ఆకట్టుకుంది. ఆన్‌లైన్‌ అమ్మకాల మహిమ వల్ల.... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగానూ అందుబాటులోకొచ్చింది!

సెన్సర్ల సాయంతో...

ఈ సైకిల్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 60 నుంచి 80 కిలో మీటర్ల దూరం వరకు, గరిష్ఠంగా 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని మీద వెళ్తున్న సమయంలో మనకు నడవాలి అనిపించింది అనుకోండి. ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు.. సెన్సర్లు మన కాళ్లకింద ఉన్న ట్రెడ్‌మిల్‌్ మోటార్‌ను ఆన్‌ అయ్యేలా చేస్తాయి. అప్పుడిక హాయిగా సైకిల్‌ ముందుకు సాగుతుంటే... ఎంచక్కా ట్రెడ్‌మిల్‌ మీద నడవొచ్చు. పార్కుల్లో, ప్రకృతి మధ్య ట్రెడ్‌మిల్‌ మీద నడవాలనుకున్నవారి కోసమే ఈ సైకిల్‌ను తయారు చేశారు. మనకు అవసరం లేదనుకుంటే... ట్రెడ్‌మిల్‌ను యాక్టివేట్‌ చేసుకోకుండానే దీనిమీద ప్రయాణించవచ్చు. కానీ కూర్చోవడం మాత్రం కుదరదు. నిల్చొనే ప్రయాణించాల్సి ఉంటుంది. అన్నట్లు ఈ ట్రెడ్‌మిల్‌్ సైకిల్‌ దాదాపు 120 కిలోల వరకు బరువును మోయగలదంట. ప్చ్‌... కానీ దీనికి రివర్స్‌ గేర్‌ లేదు. నేస్తాలూ..! మొత్తానికి ఇవీ వింత సైకిల్‌ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!!... అవును మీకు ఇంతకూ సైకిల్‌ తొక్కడం వచ్చా... వస్తే సంతోషం! రాకపోయినా పర్లేదు!! అమ్మానాన్న సాయంతో నేర్చుకోండి సరేనా! ఎందుకంటే... సైక్లింగ్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు