ఆకాశానికి కార్ల నిచ్చెన!

హలో ఫ్రెండ్స్‌.. మనకు చైనా అనగానే అతి తక్కువ ధరకు వచ్చే ఎలక్ట్రానిక్‌ తదితర వస్తువులే గుర్తుకొస్తాయి. ధర తక్కువ కాబట్టి వాటి నుంచి ఎక్కువ నాణ్యతను ఆశించరు.

Published : 12 Oct 2023 00:55 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు చైనా అనగానే అతి తక్కువ ధరకు వచ్చే ఎలక్ట్రానిక్‌ తదితర వస్తువులే గుర్తుకొస్తాయి. ధర తక్కువ కాబట్టి వాటి నుంచి ఎక్కువ నాణ్యతను ఆశించరు. కానీ, ఆ దేశానికి చెందిన ఓ వాహన తయారీ సంస్థ మాత్రం.. తమ ఉత్పత్తులు అత్యంత నాణ్యమైనవని వినూత్నంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆ వివరాలే ఇవీ..

మన పొరుగు దేశం చైనాకు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ‘చెరీ’. అది ఇటీవల ఓ కొత్త ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేసింది. సాధారణంగా అన్ని దేశాల్లోని వాహన తయారీ సంస్థల మధ్య ఉన్నట్లుగానే అక్కడా తీవ్ర పోటీ ఉందట. దాంతో తమ కొత్త కారు ఎంత దృఢంగా ఉందో ప్రజలకు చూపించాలనుకుందా సంస్థ. అందుకు వారు చేసిన పని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఒకటీ, రెండూ కాదు..

వాహనాలను అన్ని విధాలుగా పరీక్షించి వాటికి రేటింగ్‌ ఇచ్చేందుకు ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి ఉంటుంది. ‘చెరీ’ సంస్థ మాత్రం ఒక అడుగు ముందుకేసి, తమ కొత్త కార్లను ఒకదానిపైన మరొకదాన్ని ఉంచి మరీ నాణ్యతను ప్రదర్శించింది. ఒకటీ రెండూ కాదు నేస్తాలూ.. ఏకంగా ఏడు కార్లను అలా ఉంచారట. ‘అరరె.. అలా పెడితే వాహనాలు పాడైపోతాయి కదా?’ అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అందుకే, ఒక కారుపైన రేకు లాంటి గట్టి వస్తువును ఉంచి దాని మీద మరో వాహనం.. దానిమీద ఇంకో రేకు ఉంచి, ఆపైన మరో కారు.. ఇలా పెట్టారన్నమాట. దీనికోసం భారీ క్రేన్లను ఉపయోగించారు.  

లెక్కకు నాలుగే..

చైనాలోని భద్రతా నిబంధనల ప్రకారం.. ఏదైనా వాహనం, దాని బరువుకంటే నాలుగు రెట్లు అధికంగా మోయగలిగితేనే ప్రమాణాల మేరకు ఉన్నట్లు పరిగణిస్తారు. ‘చెరీ’ సంస్థ మాత్రం అంతకుమించిన సాహసం చేసింది. తమ ఉత్పత్తుల మీద నమ్మకంతో ఏకంగా ఏడు కార్లను ఉంచింది.

ఇదే మొదటిసారి కాదట..

ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి చెందిన కొందరు మాత్రం ఈ ఫీట్‌ తొలిసారేం కాదని అంటున్నారు. యూరప్‌కు చెందిన ఓ వాహన తయారీ సంస్థ 1980ల్లో మొదటిసారి ఇలాంటి సాహసం చేసిందట. అదే సంస్థ 2021లోనూ ఏడు కార్లను ఇలా ఒకదానిపైన మరోదాన్ని ఉంచి నాణ్యతను పరీక్షించిందని చెబుతున్నారు. చైనా కంపెనీ తాజాగా చేసిన పరీక్షకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని