ఇది మీసమున్న కోతి!

చూపులేమో అమాయకం... మీసాలు చూస్తేనేమో చాలా పొడవు! ఒళ్లు మూరెడు.. తోకేమో బారెడు.

Updated : 13 Oct 2023 04:29 IST

చూపులేమో అమాయకం... మీసాలు చూస్తేనేమో చాలా పొడవు! ఒళ్లు మూరెడు.. తోకేమో బారెడు. పేరులో చక్రవర్తి..! తీరులో రాజసం!! మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది కదూ.. ఇదంతా ఓ వానరం గురించి అని! మరి ఇంకెందుకాలస్యం... ఆ కోతి గురించి మరిన్ని విశేషాలు చదివేయండి.

చూడ్డానికి కాస్త చిత్రంగా, ఇంకాస్త విచిత్రంగా ఉన్న ఈ కోతి పేరు ఎంపరర్‌ టామరిన్‌. ఇది చూడ్డానికి కాస్త జర్మన్‌ చక్రవర్తి విల్‌హెల్మ్‌-2 ను పోలి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ కోతి... బ్రెజిల్‌, పెరూ, బొలీవియాలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని శరీరంపైన వెంట్రుకలు బూడిద రంగులో ఉంటాయి. ఛాతిమీద కాస్త పసుపు రంగు మచ్చలుంటాయి. చేతులు, వీపు, కాళ్లు నలుపురంగులో ఉంటాయి. తోక మాత్రం గోధుమ రంగులో ఉంటుంది.

అర కిలోనే...

ఈ కోతి 23 నుంచి 26 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. దీని తోకేమో 35 నుంచి 41.5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇక బరువు విషయానికొస్తే.. 500 గ్రాముల వరకు మాత్రమే తూగుతుంది. దీనికి తెల్లరంగులో పొడవైన మీసాలతోపాటు, తెలుపు రంగు గడ్డం కూడా ఉంటుంది. ఇవి ఒంటరిగా ఉండవు. గుంపులుగా ఉంటాయి. ఒక్కో గుంపులో రెండు నుంచి ఎనిమిది వరకు ఉంటాయి. కొన్ని సార్లు పద్దెనిమిది వరకు కూడా కలిసి గుంపులుగా జీవిస్తాయి.

పూలూ.. పండ్లూ..

ఇవి ఎక్కువగా పూలు, పండ్లను ఆహారంగా తీసుకుంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న కీటకాలను, ఇంకొన్నిసార్లు కప్పలను కూడా కరకరలాడించేస్తాయి. ఈ కోతులు ఎప్పుడూ చురుగ్గా ఉంటాయి. పెద్ద పెద్ద అరుపులతో ఇవి తమ తోటి వానరాలకు సమాచారాన్ని చేరవేస్తాయి. ముఖ్యంగా ఏమైనా ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు ఇలా చేస్తాయి. ఇవి మనుషులకూ మచ్చిక అవుతాయి. నేస్తాలూ మొత్తానికి ఇవీ ఈ మీసమున్న కోతి విశేషాలు. మీకు నచ్చాయి కదూ! అన్నట్లు మరో విషయం.. కోతులు వన్యప్రాణులు. అవి మనమీద దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి.. సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే మనమూ వాటిని హింసించకూడదు. జీవహింస మహాపాపం. చట్టరీత్యా నేరం కూడా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని