రివర్‌ ది బ్లూ డ్రాగన్‌!!

హాయ్‌ నేస్తాలూ... కొండల నడుమ మెలికలు తిరుగుతూ ప్రవహిస్తున్న ఈ నది అచ్చం డ్రాగన్‌లా కనిపిస్తోంది కదూ! ఇంతకీ దీని పేరేంటి.

Updated : 16 Oct 2023 03:32 IST

హాయ్‌ నేస్తాలూ... కొండల నడుమ మెలికలు తిరుగుతూ ప్రవహిస్తున్న ఈ నది అచ్చం డ్రాగన్‌లా కనిపిస్తోంది కదూ! ఇంతకీ దీని పేరేంటి. ఇది ఎక్కడుంది.. ఇలాంటి వివరాలు తెలుసుకోవాలని తహతహలాడుతున్నారు కదూ! అయితే ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది.

బ్లూ డ్రాగన్‌ అని పిలుచుకునే ఈ నది అసలు పేరు ఓడెలైట్‌. పోర్చుగల్‌లోని అల్గార్వేలోని కాస్ట్రో మారిమ్‌ మున్సిపాలిటీలో ఈ నదిపై డ్యాం ఉంది. దీనివల్లే ఈ నది డ్రాగన్‌ రూపాన్ని సంతరించుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఓడెలైట్‌ నది గ్వాడియానా నదికి ఉపనది.

2015లో మొదటిసారి...

ఈ నది వైమానిక చిత్రం మొదటిసారి 2015లో వైరల్‌ అయింది. ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి మర్రకేచ్‌ మధ్య విమానంలో అల్గార్వ్‌ మీదుగా గతంలో ప్రయాణించిన ఓ వ్యక్తి మొదట చిత్రాన్ని తీశారు. తర్వాత దీన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీని ఆకారం అచ్చం డ్రాగన్‌ను పోలి ఉండటంతో ‘బ్లూ డ్రాగన్‌ రివర్‌’లా ఫేమస్‌ అయింది. ఈ నది నీరు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. పై నుంచి చూసినప్పుడు నీలి రంగులో భలేగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ నది మత్స్యసంపదకు పెట్టింది పేరు. అరుదైన బార్బెల్‌, క్రాప్‌, బాస్‌ రకాల చేపలకూ ఈ బ్లూడ్రాగన్‌ రివర్‌ నిలయం.

సొగసు చూడతరమా!

వంపులు తిరుగుతూ... ప్రవహించే ఈ నది అందాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. దీన్ని ఆనుకుని పలు పల్లెలు, పట్టణాలూ ఉన్నాయి. కొండలూ, పచ్చదనమూ పరుచుకుని ఉంటుంది. అందుకే బ్లూ డ్రాగన్‌ రివర్‌ను చూడ్డానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా డ్రాగన్‌ను ఎంతో పవిత్రంగా భావించే చైనీయులు ఎక్కువగా ఈ నదిని వీక్షించడానికి ఆసక్తి చూపుతుంటారు. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ‘బ్లూ డ్రాగన్‌ రివర్‌’ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని