నేను రంగుల నక్కనోచ్‌..!

హాయ్‌ నేస్తాలూ.. ఎలా ఉన్నారు..? నేనైతే చాలా బాగున్నా.. నా గురించి మీకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు.

Updated : 17 Oct 2023 05:49 IST

హాయ్‌ నేస్తాలూ.. ఎలా ఉన్నారు..? నేనైతే చాలా బాగున్నా.. నా గురించి మీకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. మీరెప్పుడూ నన్ను చూసి కూడా ఉండకపోవచ్చు.. అందుకే ఒకసారి పరిచయం చేసుకొని వెళ్దామని ఇలా వచ్చాను.. ఇక ఆలస్యమెందుకు.. వెంటనే ఈ కథనం చదివేయండి.. నేనెవరో తెలిసిపోతుంది..!

నా పేరు ‘మెలనిస్టిక్‌ ఫాక్స్‌’. పేరు కాస్త కొత్తగా అనిపిస్తుంది కదూ.. అందుకే సింపుల్‌గా ‘రెడ్‌ ఫాక్స్‌’ అని పిలిచేయండి.. ఎందుకంటే నన్ను అలా కూడా అంటుంటారు. నా శరీరంలో అధిక భాగం ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి నన్ను అలా పిలుస్తుంటారు. మాలో ఇంకా చాలా రకాలు ఉంటాయి. సాధారణంగా మీకు తెలిసిన నక్కల కంటే మేము కాస్త పెద్దగా ఉంటాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తోపాటు మరికొన్ని దేశాల్లోనూ కనిపిస్తుంటాం.  

అక్కడా.. ఇక్కడా.. అని లేదు..  

నేను ఫలానా వాతావరణంలో మాత్రమే జీవిస్తానని చెప్పలేను. ఎందుకంటే అడవి, ఎడారి, మంచు.. ఇలా ఏ ప్రాంతమైనా ప్రశాంతంగా బతికేస్తాను. ఎక్కువగా గుంపులో ఉండటానికే ఇష్టపడతాను. 100 అడుగుల దూరంలో ఉన్న జంతువులను కూడా నా కంటిచూపు, వినికిడి శక్తితో ఇట్టే పసిగట్టగలను. పుట్టినప్పుడు నా కళ్లు పసుపు రంగులో ఉంటాయి.

ఆకలి లేకపోయినా వేట..

నేను తెల్లవారుజామున లేదా రాత్రివేళల్లో మాత్రమే వేటాడటానికి ఇష్టపడతాను. చాలా జంతువులు వాటికి ఆకలి వేసినప్పుడు వేటాడి, అవి తినగా మిగిలిన ఆహారాన్ని వదిలేస్తాయి. కానీ, నేను మాత్రం ఆకలి లేకపోయినా వేటాడతాను. ఆ ఆహారాన్ని నేను నివాసం ఉండే చోట జాగ్రత్తగా దాచుకొని, ఆకలేసినప్పుడు తింటాను. ఎలుకలు, పక్షుల్లాంటి చిన్న చిన్న జీవులను కూడా కరకరలాడించేస్తా. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలను. నా పొడవు 45 నుంచి 90 సెంటిమీటర్ల వరకు ఉంటుంది. బరువేమో 3 నుంచి 14 కిలోల వరకు తూగుతాను. సాధారణంగా అయితే అయిదేళ్ల వరకు.. అన్నీ అనుకూలిస్తే 15 ఏళ్ల వరకు జీవిస్తాను..  

అమ్మే గురువు...

పుట్టిన తరవాత చాలా రోజులు అమ్మ దగ్గరే ఉంటాం. ఒంటరిగా వేటాడగలిగే శక్తి వచ్చేవరకూ మా అమ్మే దగ్గరుండి నేర్పిస్తుంది. ఎన్నిరోజులైనా సరే ఆహారాన్ని తెచ్చి పెడుతుంది. మేం ఏదైనా సమాచారాన్ని మా తోటి నక్కలకు చేరవేయడానికి రకరకాల శబ్దాలు చేస్తుంటాం. ఇంకో విషయం ఏంటంటే.. మా తోక, శరీరంలో మూడో వంతు బరువు ఉంటుంది. ఆ తోకను ఊపుతూ కూడా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాం. నేస్తాలూ.. ఇవీ నా విశేషాలు.. ఆసక్తిగా ఉన్నాయి కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని