అక్కాచెల్లెళ్ల ఈత..రికార్డుల మోత!

హలో ఫ్రెండ్స్‌.. మనలో చాలామంది వేసవి సెలవుల్లో రకరకాల కొత్త అంశాలు నేర్చుకుంటారు. కొందరు డ్రాయింగ్‌, ఇంకొందరు స్విమ్మింగ్‌, మరికొంతమంది నాట్యం.. ఇలాగన్నమాట. అయితే, సాధారణంగా మనకు నీళ్లన్నా, అందులో ఆడుకోవాలన్నా సరదా కాబట్టి చాలామంది ఈతకే ఓటేస్తారు!

Published : 19 Oct 2023 00:06 IST

హలో ఫ్రెండ్స్‌.. మనలో చాలామంది వేసవి సెలవుల్లో రకరకాల కొత్త అంశాలు నేర్చుకుంటారు. కొందరు డ్రాయింగ్‌, ఇంకొందరు స్విమ్మింగ్‌, మరికొంతమంది నాట్యం.. ఇలాగన్నమాట. అయితే, సాధారణంగా మనకు నీళ్లన్నా, అందులో ఆడుకోవాలన్నా సరదా కాబట్టి చాలామంది ఈతకే ఓటేస్తారు! ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు మాత్రం ఏకంగా స్కూబా డైవింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించేశారు. ఆ వివరాలే ఇవీ..

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు చెందిన ఓవీ, రుచి.. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వీళ్ల నాన్న నీరజ్‌. ఆయన గత 16 ఏళ్లుగా స్కూబ్‌ డైవింగ్‌ చేస్తున్నారు. అంతేకాదు.. ‘బెంగళూరు మౌంటెనీరింగ్‌ క్లబ్‌’ ఫౌండర్‌ కూడా. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్న ఓవీ.. ఇటీవల ‘యంగెస్ట్‌ సర్టిఫైడ్‌ స్కూబా డైవర్‌’గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వీళ్ల అక్క రుచి కూడా గతేడాదే ఈ ఘనత సాధించింది. తాజాగా చెల్లి కూడా రికార్డు నెలకొల్పడంతో వీరిద్దరూ ‘యంగెస్ట్‌ సర్టిఫైడ్‌ స్కూబా డైవర్‌ సిబ్లింగ్స్‌’గా నిలిచారన్నమాట.  

అలా ఆసక్తి..

స్కూబా డైవింగ్‌ అనేది ఓ సాహస క్రీడ. దాంతో తాను డైవర్‌ అయినా, పిల్లలకు అది చాలా కష్టమని భావించారు నీరజ్‌. అందుకే ఓవీ, రుచిని మొదట్లో ఆ దిశగా ప్రోత్సహించలేదాయన. తండ్రి డైవింగ్‌కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో చూస్తూ, ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ ఆసక్తి పెంచుకున్నారు. తాము కూడా స్కూబా డైవింగ్‌ నేర్చుకుంటామని పట్టుబట్టారు. వారి ఆసక్తిని చూసి, నాన్న సరేనన్నారట. అలా ఇద్దరినీ స్విమ్మింగ్‌ క్లాసులో చేర్చారాయన.

ప్రపంచంలో ఎక్కడైనా..

క్రమక్రమంగా ఈతతోపాటు స్కూబా డైవింగ్‌లోనూ శిక్షణ తీసుకున్నారీ అక్కాచెల్లెళ్లు. గత వారం పుదుచ్చెరిలోని సముద్ర తీరంలో ఓవీ రికార్డు సృష్టించింది. వీరిద్దరూ ఈ ఘనత ఏదో సాదాసీదాగా సాధించలేదు ఫ్రెండ్స్‌.. ఆగకుండా 200 మీటర్లు ఈత కొట్టడం, పది నిమిషాల పాటు నీటిపైన తేలుతూ ఉండటం సాధన చేశారట. అంతేకాదు.. నీటిలోపల ఎక్కువ సేపు ఉండేందుకు కావాల్సిన సూచనలు, సలహాల పుస్తకాలనూ బాగా చదివారు. దానికి సంబంధించిన పరీక్ష రాసి, అందులో ఉత్తీర్ణత సాధించారు. వీరిద్దరూ నీళ్లలో 18 అడుగుల లోతుకు వెళ్లగలరు. ఈ సర్టిఫికేషన్‌తో ప్రపంచంలో ఎక్కడైనా స్కూబా డైవింగ్‌ చేయవచ్చట. భవిష్యత్తులో సముద్రజలాలు కలుషితం కాకుండా చూడటంతోపాటు ప్లాస్టిక్‌ నిర్మూలనకు కృషి చేస్తానని రుచి చెబుతోంది. చెల్లి ఓవీ మాత్రం.. తండ్రి ఆధ్వర్యంలో నడుస్తున్న మౌంటెనీరింగ్‌ క్లబ్‌లో శిక్షకురాలిగా చేరి, మరింత మందిని తనలా తీర్చిదిద్దుతానంటోంది. నేస్తాలూ.. మొత్తానికి ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని