అయిదు అంతస్తుల అగ్గిపెట్టెంత ఇల్లు!

ఇల్లు విశాలంగా ఉండాలి... అప్పుడే తగినంత గాలి, సూర్యరశ్మి వస్తాయి. అయితే పట్టణాలు, నగరాల్లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కాస్త ఇరుకు ఇళ్లలో నివసించడం తప్పడం లేదు. కానీ, నేస్తాలూ... టోక్యోలో ఓ ఇల్లు మాత్రం అచ్చంగా అగ్గిపెట్టెను గుర్తుకు తెస్తోంది.

Updated : 20 Oct 2023 05:14 IST

ఇల్లు విశాలంగా ఉండాలి... అప్పుడే తగినంత గాలి, సూర్యరశ్మి వస్తాయి. అయితే పట్టణాలు, నగరాల్లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కాస్త ఇరుకు ఇళ్లలో నివసించడం తప్పడం లేదు. కానీ, నేస్తాలూ... టోక్యోలో ఓ ఇల్లు మాత్రం అచ్చంగా అగ్గిపెట్టెను గుర్తుకు తెస్తోంది. అది కూడా అయిదు అంతస్తుల భవనం! ఈ వింత భవంతి గురించి ఓ యూట్యూబర్‌ తీసిన వీడియో వల్ల ప్రపంచానికి తెలిసింది. ఇంకేముంది దీన్ని వీక్షించిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. మరి మనమూ ఆ విచిత్ర భవనం గురించి తెలుసుకుందామా!

నార్మ్‌ నకమురా అనే అంకుల్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో ఆయన చిన్న చిన్న ఇళ్లు, దుకాణాలకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితమే ఆయన టోక్యోలోని ఈ అతి చిన్న అయిదంతస్తుల భవనం వీడియోను పోస్ట్‌ చేశారు. ఇలా అప్‌లోడ్‌ చేశారో లేదో... అది అలా వైరల్‌గా మారింది. అక్టోబర్‌ 8న పోస్ట్‌ చేసిన ఈ వీడియోను 19వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల వరకు దాదాపు 55 లక్షల మంది వీక్షించారు. సుమారు పదివేల వరకు కామెంట్లు వచ్చాయి.

ఎంత ఇరుకో...

ఈ బుజ్జి ఇల్లు వెడల్పు 2.5 మీటర్లు మాత్రమే. ఇందులోనే వంటగది, షవర్‌తో కూడిన స్నానాల గది, టాయిలెట్‌, చిన్న ఫ్రిజ్‌, ఏసీ ఉన్నాయి. ఫర్నిచర్‌ పెట్టుకోవడానికి మాత్రం అంతగా స్థలం లేదు. నిజానికి ఈ భవంతిలోకి వెళ్లేటప్పుడు మెట్లెక్కడమూ నరకప్రాయమే! కానీ జపాన్‌ రాజధాని నగరమైన టోక్యోలో తక్కువ అద్దెలో కావాలంటే మాత్రం ఈ ఇల్లే దిక్కట! ఇందులో తలదాచుకోవాలనుకుంటే భారత కరెన్సీలో నెలకు కేవలం 22,230 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందట. ‘అమ్మో.. అంత మొత్తమా!?’ అని మీరనుకోవచ్చు కానీ, ఆ నగరంలో ఉన్న అద్దెలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువట.

చెవులకు చిల్లులే!

జేబుకు పడే చిల్లులు తప్పించుకుందామని ఎవరైనా అనుకుంటే మాత్రం తమ చెవులకు పడే చిల్లులను భరించాల్సిందే. ఎందుకంటే ఈ బుజ్జి భవంతికి రెండు పక్కల ఉన్న రోడ్ల మీద తిరిగే వాహనాల నుంచి వచ్చే రణగొణ ధ్వనులు చాలా తీవ్రంగా ఉంటాయట. ఈ వీడియోను చూసి కామెంట్‌ చేసిన వారిలోనూ చాలా మంది దీన్నో ‘చెత్త ఇల్లు’గా అభివర్ణిస్తున్నారు. ఇది అసలేమాత్రం నివాసయోగ్యం కాదంటున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ అయిదు అంతస్తుల అగ్గిపెట్టెంత భవనం విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని