బుడగే... గొడుగైతే..!

‘ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది’ అంటుంటారు. కానీ అసలు ఒక్క ఇటుక కూడా వాడకుండానే ఇల్లు కట్టుకోవచ్చు తెలుసా! అలా అని అదేదో గుడిసె అనుకునేరు.

Updated : 22 Oct 2023 04:49 IST

‘ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది’ అంటుంటారు. కానీ అసలు ఒక్క ఇటుక కూడా వాడకుండానే ఇల్లు కట్టుకోవచ్చు తెలుసా! అలా అని అదేదో గుడిసె అనుకునేరు. కానే కాదు... ఎప్పుడు పుటుక్కున పగిలిపోతుందో.. తెలియని నీటి బుడగను ఆదర్శంగా తీసుకుని గొడుగుల్లాంటి ఇళ్లను కడుతున్నారు. అలా అని ఇవేమీ బలహీనమైనవి కాదు. చాలా బలమైనవి. తుపాన్లు, భూకంపాల్లాంటి విపత్తులనూ తట్టుకోగలవట. మరి ఈ విచిత్రమైన ఇళ్ల గురించి తెలుసుకుందామా!

‘బ్లో బబుల్స్‌ టు బిల్డ్‌ హౌస్‌’ అనే నినాదంతో అమెరికాకు చెందిన ‘బినిషెల్స్‌’ అనే కంపెనీ ఇళ్ల నిర్మాణం చేస్తోంది. వీళ్లు మొదట అనుకున్న ఆకారం ప్రకారం పునాది నిర్మిస్తారు. తర్వాత దాని ఆకృతిలోనే పెద్ద బుడగను యంత్రాల సాయంతో గాలితో నింపుతారు. ఇప్పుడు ప్రాథమికంగా ఇంటి ఆకృతి సిద్ధమైపోయినట్లే.

ఉక్కు సంకల్పంతో...

అంతా అనుకున్నట్లు గాలి బుడగ తయారైన తర్వాత.. దాని ఆధారంగా స్టీల్‌ రాడ్లను అమరుస్తారు. ఈ పనంతా పూర్తయ్యాక, స్ప్రే గన్ల సాయంతో కాంక్రీట్‌ను ఈ ఆకృతి మీద క్రమపద్ధతిలో చల్లుతారు. ఇదంతా కేవలం ఒక్కరోజులోనే పూర్తవుతుంది.

ఖర్చు తక్కువే!

కాంక్రీట్‌ చల్లడం పూర్తయ్యాక దాన్ని ఆరనిస్తారు. తర్వాత బుడగలో గాలిని జాగ్రత్తగా తీసివేస్తారు. ఇప్పుడు ఈ బుడగను మరో ఇంటి నిర్మాణానికి కూడా వాడుకోవచ్చు. సంప్రదాయక నిర్మాణ పద్ధతులతో పోల్చుకుంటే, ఈ బుడగల విధానంలో సమయం, ఖర్చు రెండూ చాలా వరకు తగ్గిపోతాయి. దాదాపు 66 శాతం వరకు వనరులు ఆదా అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

బలమైన గూడు!

సాధారణ ఇళ్లతో పోల్చుకుంటే ఇలా తయారైన గృహాలు బలంగా ఉంటాయి. పునాది మీద ఒత్తిడి అంతా ఒకేచోట పడకుండా, అంతటా విస్తరించేలా చూసుకుంటాయి. దీని వల్ల వీటి జీవిత కాలం చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్ని ప్రమాదాల్లాంటి ప్రకృతి విపత్తులను సమర్థంగా తట్టుకుంటాయట. అంతేకాకుండా, మనకు నచ్చిన ఆకృతిలో, చాలా తేలిగ్గా ఇంటిని నిర్మించుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో అందమైన, ప్రత్యేకమైన ఇంటిని నిర్మించుకోవచ్చట. పర్యావరణానికి వీటివల్ల హాని ఉండదు. ప్రస్తుతం విదేశాల్లో.. ముఖ్యంగా చాలా వరకు పర్యాటక ప్రాంతాల్లో నిర్మాణాలను ఈ పద్ధతిలోనే చేపడుతున్నారట. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ఇటుకలు వాడకుండా నిర్మితమయ్యే ఇంటికి సంబంధించిన వివరాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని