అరుదైన పక్షిని నేను!

ఫ్రెండ్స్‌... బాగున్నారా! ఏంటి అలా చూస్తున్నారు. ‘ఈ వింత పక్షి పేరేంటి? ఇంతకీ ఇది ఎక్కడ నుంచి వచ్చిందబ్బా...!’ అని ఆలోచిస్తున్నారు కదూ!

Updated : 23 Oct 2023 03:34 IST

ఫ్రెండ్స్‌... బాగున్నారా! ఏంటి అలా చూస్తున్నారు. ‘ఈ వింత పక్షి పేరేంటి? ఇంతకీ ఇది ఎక్కడ నుంచి వచ్చిందబ్బా...!’ అని ఆలోచిస్తున్నారు కదూ! అవన్నీ చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. తెలుసుకుంటారా మరి!

నా పేరు షూబిల్‌. నేనో కొంగను. నా ముక్కు చాలా పెద్దగా ఉంటుంది. బూడిద రంగులో ఉంటాను. చూడ్డానికి కాస్త గంభీరంగా కనిపిస్తాను కానీ... నేను మరీ అంత ప్రమాదకరమైన పక్షినేం కాదు! మీ మనుషుల మీద కూడా దాడేం చేయను! ఆఫ్రికా ఖండం నా పుట్టినిల్లు. దక్షిణ సూడాన్‌ నుంచి జాంబియా వరకు కనిపిస్తుంటాను. అన్నట్లు నాకు వేల్‌ హెడ్‌ కొంగ అనే మరో పేరు కూడా ఉంది తెలుసా.

ప్రాచీన జీవిని..

నేను చాలా ప్రాచీన కాలం నుంచి ఈ భూమి మీద జీవిస్తున్నా. పురాతన ఈజిప్షియన్లకు కూడా నేను తెలుసు. చాలా పెద్ద పక్షిని. దాదాపు 110 నుంచి 140 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతాను. మాలో కొన్ని 150 సెంటీమీటర్ల వరకు కూడా పెరుగుతాయి. రెక్కలేమో 230 నుంచి 260 సెం.మీ. పొడవుంటాయి. ఇక బరువు విషయానికొస్తే 4 నుంచి 7 కిలోల వరకు పెరుగుతాను. మాలో ఆడవాటికన్నా.. మగ పక్షులే కాస్త ఎక్కువ బరువుంటాయి.

మౌనంగానే బతకమని...

నేను సాధారణంగా నిశ్శబ్దంగా ఉంటాను. కానీ... అవసరమైనప్పుడు మాత్రం చాలా పెద్ద శబ్దాలను చేయగలను. అవి తుపాకీ పేల్చిన శబ్దాన్ని పోలి ఉంటాయి. మాలో చిన్నపక్షులు తమకు ఆకలి వేసినప్పుడు అచ్చం మీకు వెక్కిళ్లు వచ్చినప్పటి శబ్దాన్ని చేస్తాయి. మేం చాలా నెమ్మదిగా కదులుతుంటాం. కొన్నిసార్లు చాలా సమయం వరకు అసలు కదలకుండా ఉండిపోతాం. నేను ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకుంటాను. ఇంకా కప్పలు, నీటిపాములు, చిన్న చిన్న మొసళ్లు, తాబేళ్లు, నత్తలు, ఎలుకల్ని కూడా కరకరలాడించేస్తాను. ప్రస్తుతం మేం అంతరించిపోయే స్థితిలో ఉన్నాం. మా సంఖ్య కేవలం వేలల్లోనే ఉంది. నేస్తాలూ... మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటా మరి.. బై.. బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని