‘మ్యావ్‌.. మ్యావ్‌...’ ఇది పిల్లుల అడ్డా!

అనగనగా ఓ దీవి. అక్కడ అడుగు పెడితే చాలు... ‘మ్యావ్‌.. మ్యావ్‌..’ అరుపులే మన చెవులను తాకుతాయి. కనుచూపుమేర పిల్లులే పిల్లులు! అక్కడి జనం కన్నా... వీటి సంఖ్యే ఎక్కువ. మరింతకీ ఆ దీవి ఎక్కడుంది.

Updated : 25 Oct 2023 03:58 IST

అనగనగా ఓ దీవి. అక్కడ అడుగు పెడితే చాలు... ‘మ్యావ్‌.. మ్యావ్‌..’ అరుపులే మన చెవులను తాకుతాయి. కనుచూపుమేర పిల్లులే పిల్లులు! అక్కడి జనం కన్నా... వీటి సంఖ్యే ఎక్కువ. మరింతకీ ఆ దీవి ఎక్కడుంది. అసలు ఆ దీవిలో ఇన్ని పిల్లులు ఎందుకున్నాయో తెలుసుకుందామా!!

యోషిమా.. ఇది జపాన్‌కు చెందిన దీవి. దీనికే ‘పిల్లుల దీవి’ అని పేరు. ఇక్కడ మ్యావ్‌మ్యావ్‌ల సంఖ్య చాలా అధికం. ఈ దీవి చుట్టుకొలత కేవలం 1.6 కిలోమీటర్లు మాత్రమే. ఒకప్పుడు ఈ దీవిలో మనుషుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండేది. కానీ ఉద్యోగ, వ్యాపారాలరీత్యా వాళ్లు చుట్టుపక్కల దీవులకు వెళ్లిపోయారు. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం ప్రకారం మే 2023నాటికి ఆ దీవిలో కేవలం అయిదుగురు మనుషులు మాత్రమే మిగిలారట.

ఎంచక్కా అప్పట్లో...

ఈ దీవిలో 1945లో సుమారు 900 మంది జీవిస్తుండేవారు. 2013 నాటికి ఈ దీవిలో మనుషుల సంఖ్య 50కి తగ్గింది. 2018నాటికి ఏకంగా 13కి పడిపోయింది. 2019 సంవత్సరంలో కేవలం ఆరుగురు మాత్రమే నివసిస్తుండేవారు. పిల్లులు చూడ్డానికి వచ్చే పర్యాటకుల సంఖ్య మాత్రం ఏటా పెరుగుతోంది. వాళ్లే ఈ పిల్లులకు ఆహారాన్ని సమకూరుస్తున్నారు.

హాని కలిగించరు...

అసలు ఈ దీవిలోకి పిల్లులు ఎలా వచ్చాయో తెలుసా! పూర్వం 1600 నుంచి 1868 సంవత్సరాల మధ్య ఈ దీవిలో పట్టుపురుగుల పెంపకం పెద్ద ఎత్తున జరిగేది. అప్పట్లో ఈ దీవిలో చాలా ఎలుకలు ఉండేవి. వీటివల్ల పట్టుపురుగులకు తీవ్ర హాని జరుగుతుండేది. ఈ ఎలుకల బాధ తప్పించుకునేందుకు పిల్లులను ఈ దీవిలోకి తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ జాగాలో పిల్లులు పాగా వేశాయి. తర్వాత కాలంలో ఇక్కడి ప్రజలు చేపల వేటకు ప్రాధాన్యం ఇచ్చినా... పిల్లులను మాత్రం వెళ్లగొట్టలేదు. అన్నట్లు ఇక్కడ మ్యావ్‌.. మ్యావ్‌లకు ఎటువంటి హానీ కలిగించరట. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ‘మ్యావ్‌.. మ్యావ్‌.. దీవి’ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని