నేనో బుజ్జి అడవిపిల్లిని!

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా! నన్ను, నా చారల్ని చూసి కాస్త భయపడుతున్నారు కదూ! కానీ అంత అవసరం లేదు! ఎందుకంటే నేనేమీ చిరుతపులినో, జాగ్వార్‌నో కాదు.

Updated : 27 Oct 2023 04:06 IST

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా! నన్ను, నా చారల్ని చూసి కాస్త భయపడుతున్నారు కదూ! కానీ అంత అవసరం లేదు! ఎందుకంటే నేనేమీ చిరుతపులినో, జాగ్వార్‌నో కాదు. చూడ్డానికి కొంచెం వాటిలా ఉండే బుజ్జి అడవిపిల్లిని మాత్రమే! మరి నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉందా?! అందుకే నా విశేషాలు చెప్పిపోదామని, ఇదిగో ఇలా వచ్చాను.

ఇంతకీ నా పేరేంటో మీకు చెప్పలేదు కదూ! నన్ను మార్గే అని పిలుస్తారు. నేను దక్షిణ అమెరికాకు చెందిన బుజ్జి అడవి పిల్లిని. కానీ ఒంటి మీద చారలు మాత్రం అచ్చం జాగ్వార్‌ను పోలి ఉంటాయి. ఒకప్పుడు మా సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. మమ్మల్ని విపరీతంగా వేటాడటం వల్ల ప్రస్తుతం మా సంఖ్య చాలా తక్కువగా ఉంది. మీ మనుషులు అడవులను నాశనం చేయడం కూడా మేం ముప్పు ముంగిట ఉండటానికి ఓ కారణం.

చిన్ని తల.. పొడవైన తోక!

నా తల చాలా చిన్నగా ఉంటుంది. కళ్లు మాత్రం పెద్దగా ఉంటాయి. తోక కూడా దాదాపు 33 నుంచి 51 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటుంది. బరువేమో 2.6 నుంచి 4 కేజీల వరకు తూగుతాను. 48 సెంటీమీటర్ల నుంచి 79 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను.

నిక్షేపంగా చెట్ల మీదే కాలక్షేపం!

నేను చకచకా చెట్లను ఎక్కగలను. మరో విషయం ఏంటంటే కోతిలా చెట్ల మీద కూడా విన్యాసాలూ చేయగలను. రోజులో ఎక్కువ సమయం చెట్ల మీదే కాలక్షేపం చేస్తాను. నేను దాదాపు 12 అడుగుల దూరం వరకు గెంతగలను. మా పొడవైన తోక కూడా మేం బ్యాలెన్స్‌ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

చక్కగా వేటాడేస్తా...

నేను ఎంతో నేర్పుగా వేటాడతాను. కోతులు, పక్షులను పట్టుకుని తినేస్తాను. బల్లులు, తొండలు, ఉడుతలు, కప్పలనూ కరకరలాడించేస్తా. అప్పుడప్పుడు నాకు జీర్ణసంబంధిత సమస్యలొస్తే గడ్డి, పండ్లనూ తింటాను తెలుసా. నా వేటంతా ఎక్కువగా చెట్ల మీదే ఉంటుంది. అలాగని నాకు నేల మీద వేట రాదని కాదు. గినియాపిగ్‌, ఎలుకల్లాంటి జీవులనూ ఎంచక్కా వేటాడగలను. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని