చెట్లే జంతువులు.. పుష్పాలే పక్షులు..!

హాయ్‌ నేస్తాలూ..! గార్డెన్‌ అనగానే మనకు రకరకాల చెట్లు, రంగురంగుల పూలు, ఆట వస్తువులు, ఫౌంటెయిన్లు ఇలా బోలెడు గుర్తుకొస్తాయి కదా.. దాదాపు అన్ని పార్కుల్లో ఉండేవివే. అవన్నీ మనకు బోర్‌ కూడా కొట్టేసుంటాయి.

Published : 28 Oct 2023 01:26 IST

హాయ్‌ నేస్తాలూ..! గార్డెన్‌ అనగానే మనకు రకరకాల చెట్లు, రంగురంగుల పూలు, ఆట వస్తువులు, ఫౌంటెయిన్లు ఇలా బోలెడు గుర్తుకొస్తాయి కదా.. దాదాపు అన్ని పార్కుల్లో ఉండేవివే. అవన్నీ మనకు బోర్‌ కూడా కొట్టేసుంటాయి. కానీ, ఇప్పుడు మనం తెలుసుకోబోయే గార్డెన్‌.. వీటన్నింటికీ చాలా భిన్నంగా ఉంటుంది. దానికి ఎన్నో ప్రత్యేకతలూ ఉన్నాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!

దుబాయ్‌లోని ‘మిరాకిల్‌ గార్డెన్‌’.. ఇది ప్రపంచంలోనే పువ్వులతో ఏర్పాటు చేసిన అతిపెద్ద గార్డెన్‌. ఇది మొత్తం 72,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. మరి ఇంత పెద్ద ఉద్యానవనం నిర్మించాలంటే, దాని వెనక ఎంతో శ్రమ దాగి ఉంటుంది కదా.. దీని నిర్మాణానికి వందలాది మంది రేయింబవళ్లు కష్టపడ్డారట.

ఎన్నో రకాలు..

ఈ గార్డెన్‌లో దాదాపు 5 కోట్ల రకాల పువ్వులు, 25 కోట్ల రకాల మొక్కలు ఉన్నాయి. ఇక్కడికి అక్టోబరు నుంచి ఏప్రిల్‌ వరకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. మే నెల నుంచి సెప్టెంబరు వరకు ఈ గార్డెన్‌ను మూసే ఉంచుతారట. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ అధిక ఉష్టోగ్రతలు నమోదవుతుంటాయి.

చాలా ప్రత్యేకతలు

ఈ మిరాకిల్‌ గార్డెన్‌లో ‘బటర్‌ఫ్లై గార్డెన్‌’ చాలా ప్రత్యేకమైందట. అక్కడ 26 జాతులకు చెందిన దాదాపు 1500 రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడ రకరకాల జంతువులు, చిన్న పిల్లలు ఎంతగానో ఇష్టపడే మిక్కీమౌస్‌, టెడ్డీబేర్‌.. తదితర ఆకారాలను చెట్లతోనే వినూత్నంగా మలిచారు. అలాగే పూల తీగలతోనే పక్షుల ఆకారాలు, నదిలో నీరు ప్రవహిస్తున్నట్లు, కప్పులో టీ పోస్తున్నట్లు.. ఇలా రకరకాల ఆకృతులకు ప్రాణం పోశారు. ఇంకో విషయం ఏంటంటే.. పువ్వులతో చక్కగా అలంకరించిన విమానం కూడా ఈ గార్డెన్‌కు మరో ఆకర్షణ.

ఒకటీ రెండూ కాదు..  

మరి ఇక్కడున్న వేలాది మొక్కలు, చెట్లను సంరక్షించాలంటే చాలానే నీరు అవసరం అవుతుంది కదా.. రోజుకు సుమారు 7 లక్షల 57వేల లీటర్ల నీటిని వాడతారట. శుద్ధి చేసిన డ్రైనేజీ నీటినే దీనికి ఉపయోగిస్తారు. ఈ గార్డెన్‌ ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో మూడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను సొంతం చేసుకుంది. నేస్తాలూ.. ఈ గార్డెన్‌ విశేషాలు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని