మిక్కీమౌస్‌ మొక్కనోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! మీకు మిక్కీమౌస్‌ గుర్తుందా! అదో కార్టూన్‌ క్యారెక్టర్‌ కదూ! దాని పేరుతో ఓ మొక్కుందని తెలుసా. అది నేనే! మరింతకీ నాకు ఆ పేరు ఎందుకు వచ్చింది.

Published : 29 Oct 2023 01:11 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! మీకు మిక్కీమౌస్‌ గుర్తుందా! అదో కార్టూన్‌ క్యారెక్టర్‌ కదూ! దాని పేరుతో ఓ మొక్కుందని తెలుసా. అది నేనే! మరింతకీ నాకు ఆ పేరు ఎందుకు వచ్చింది. ఇంకా నా ప్రత్యేకతలేంటో తెలుసుకోవాలని ఉంది కదా! అందుకే అవన్నీ మీతో చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

ఓచ్న సెర్రులాట... ఏంటి అలా అవాక్కయ్యారు. ఇది కూడా నా పేరే. నాకు మిక్కీమౌస్‌ మొక్క అనే పేరుతో పాటు, కార్నివాల్‌ ఓచ్న, కార్నివాల్‌ బుష్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. నాకు బెర్రీలు కాస్తాయి. అవి నల్లగా, మిక్కీమౌస్‌ చెవులను పోలి ఉంటాయి. పువ్వుల రెక్కలేమో మిక్కీ ప్యాంట్‌లా ఉంటాయి. అందుకే నాకు ఆ పేరు వచ్చింది.

ముందు పసుపు.. తర్వాత ఎరుపు!

నిజానికి నేను ఓ అలంకరణ మొక్కను. నా స్వస్థలం దక్షిణాఫ్రికా. నేను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ కనిపిస్తుంటాను. కానీ నన్ను ఈ రెండు దేశాల్లో కలుపు మొక్కలానే చూస్తారు. నాకు పసుపురంగులో ఉండే పూలు పూస్తాయి. వీటి నుంచి చక్కని సువాసన వస్తుంది. తర్వాత ఈ పువ్వులు ఎరుపు రంగులోకి మారతాయి. అప్పుడే  వీటి చివర బెర్రీలు కాస్తాయి.'

విత్తనాలు విషపూరితం...

నేను గుబురుగా పెరిగే పొదజాతి మొక్కను. నాకోసం మీరు పెద్దగా సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన పనిలేదు. అలా పెరిగేస్తానంతే. సీతాకోకచిలుకల్ని భలే ఆకర్షిస్తాను తెలుసా. నేను అందమైన మొక్కనే.. అందులో సందేహం లేదు. ప్చ్‌... కానీ నా విత్తనాలు మాత్రం విషపూరితం. చిన్నపిల్లలు, పెంపుడు జంతువులకు నా విత్తనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశముంది.

కంచులాంటి కంచెను!

నా గొప్పతనం తెలియక కొందరు కలుపు మొక్క అనేస్తారు. కానీ నన్ను కంచెగానూ పెంచుకోవచ్చు. నేను కంచులా కాపలా కాస్తాను! ఆవులు, మేకల్లాంటివి నన్ను తినలేవు కాబట్టి ఇతర మొక్కలకు నేను రక్షణకవచంలా పనిచేస్తాను. తీరప్రాంతాల్లో తోటలుగానూ పెంచుకోవచ్చు.

నేను సీతాకోకచిలుకల్ని చక్కగా ఆకర్షిస్తాను కాబట్టి బటర్‌ఫ్లై పార్కుల్లో ఎంచక్కా నన్ను పెంచుకోవచ్చు. మరో విషయం ఏంటంటే హాయిగా కుండీల్లోనూ పెరగగలను. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి. బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని