కష్టం లేకుండా ట్రెక్కింగ్‌!

హలో ఫ్రెండ్స్‌.. మనకు ఎస్కలేటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షాపింగ్‌ మాల్స్‌లోనో, ఎయిర్‌పోర్టులు, మెట్రో స్టేషన్లు, బస్టాండులు, రైల్వే స్టేషన్లలోనో చూసే ఉంటారు. అవసరం లేకపోయినా, మన ఆనందం కోసం వాటి మీద రెండు మూడుసార్లు చక్కర్లు కొడుతుంటాం.

Published : 02 Nov 2023 00:02 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు ఎస్కలేటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షాపింగ్‌ మాల్స్‌లోనో, ఎయిర్‌పోర్టులు, మెట్రో స్టేషన్లు, బస్టాండులు, రైల్వే స్టేషన్లలోనో చూసే ఉంటారు. అవసరం లేకపోయినా, మన ఆనందం కోసం వాటి మీద రెండు మూడుసార్లు చక్కర్లు కొడుతుంటాం. కానీ, కొండ ప్రాంతాల్లో ఎస్కలేటర్లను ఎక్కడైనా చూశారా? లేదు కదా.. అయితే, ఆ వివరాలేంటో మీరే తెలుసుకోండి మరి!

చైనా అనగానే అనేక వింతలకు, విశేషాలకు పెట్టింది పేరు. పరిశోధన, టెక్నాలజీ విషయంలోనూ ఆ దేశం ముందే ఉంటుంది. తాజాగా పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌కు వచ్చే వారి కోసం ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేస్తోంది. ‘నిజంగానా?’ అనిపిస్తోంది కదూ.. మీరు చదివింది నిజంగా నిజమే.  

పెద్దలు, పిల్లలకు కష్టమని..

జీజియాంగ్‌ ప్రావిన్స్‌ పరిధిలో ఉన్న కొండ ప్రాంతంలో ఓ భారీ ఎస్కలేటర్‌పైన పర్యాటకులు వెళ్తున్న వీడియో ఒకటి ఇటీవల వైరల్‌గా మారింది. దాని గురించి ఆరా తీయగా.. అసలు విషయం తెలిసి, అందరూ అవాక్కవుతున్నారు. కొందరు జట్టుగా లేదా ఒకరిద్దరో ఏదైనా కొండ కింద నుంచి నడుస్తూ దాని పైభాగానికి చేరుకుంటారు. సాధారణంగా దీన్నే ట్రెక్కింగ్‌ అంటుంటారు. అయితే, ఇది చాలా కష్టంతో కూడుకున్నది కావడంతో వృద్ధులు, చిన్నపిల్లలు కొండలు ఎక్కే సాహసం చేయలేరు. అటువంటి వారితోపాటు సాధారణ ఔత్సాహికులకూ శ్రమ, సమయం తగ్గించాలని.. చైనాలోని టూర్‌ ఆపరేటర్లు ఈ ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం ప్రారంభించారు.

‘రోప్‌ వే’ అనుకున్నా..

ఈ ఎస్కలేటర్ల ఆలోచనకు ముందు ‘రోప్‌ వే’ మార్గం వేయాలని అనుకున్నారు. కానీ, అది ఎక్కువ మందిని తీసుకెళ్లలేదు. ప్రమాదకరం కూడా కావడంతో ఎస్కలేటర్లవైపే మొగ్గు చూపారు. వైరల్‌ అవుతున్న వీడియోలోని కొండ కింద నుంచి పైవరకు మూడు కిలోమీటర్లు ఉంటుందట. మామూలుగా నడుచుకుంటూ వెళ్లాలంటే 50 నిమిషాలు పట్టే సమయం కాస్త.. ఈ ఎస్కలేటర్ల సాయంతో పది నిమిషాలకు తగ్గిపోయిందట.

తిట్టేవాళ్లూ ఉన్నారు..

ఇలా పర్వతాల్లో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం వల్ల ట్రెక్కింగ్‌ అనుభవాన్ని కోల్పోతారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పచ్చని ప్రకృతి అందాల మధ్యలోనూ షాపింగ్‌ మాల్‌కి వెళ్లినట్లు అనిపిస్తుందని మరికొందరు అంటున్నారు. పెద్దవాళ్లు మాత్రం పిల్లలతో సహా ట్రెక్కింగ్‌కు వెళ్తూ సందడిగా గడుపుతున్నారని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. ఎస్కలేటర్లు అవసరం లేని వారు, మామూలుగానే నడుచుకుంటూ ఎక్కే వెలుసుబాటూ ఉందని సలహాలిస్తున్నారు. నేస్తాలూ.. ఏదిఏమైనా ఈ ఆలోచన మాత్రం భలే ఉంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు