ఇదో ఐస్‌క్రీం ప్రపంచం..!

హాయ్‌ నేస్తాలూ.. ఐస్‌క్రీమ్స్‌ అంటే మనందరికీ చాలా ఇష్టం కదూ.. ఇప్పటి వరకు ఎన్నో రకాల ఐస్‌క్రీమ్స్‌ని తిని ఉంటాం. వాటికి సంబంధించి బోలెడు విశేషాలనూ తెలుసుకొనే ఉంటాం. ఇప్పుడు మనం ‘ఐస్‌క్రీం మ్యూజియం’ గురించి  చెప్పుకోబోతున్నాం.

Updated : 03 Nov 2023 04:53 IST

హాయ్‌ నేస్తాలూ.. ఐస్‌క్రీమ్స్‌ అంటే మనందరికీ చాలా ఇష్టం కదూ.. ఇప్పటి వరకు ఎన్నో రకాల ఐస్‌క్రీమ్స్‌ని తిని ఉంటాం. వాటికి సంబంధించి బోలెడు విశేషాలనూ తెలుసుకొనే ఉంటాం. ఇప్పుడు మనం ‘ఐస్‌క్రీం మ్యూజియం’ గురించి  చెప్పుకోబోతున్నాం. అబ్బా.. త్వరగా తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే ఆలస్యం చేయకుండా ఇది చదివేయండి మరి..!

‘మ్యూజియం ఆఫ్‌ ఐస్‌క్రీం’.. ఇది సింగపూర్‌లో ఉంది. ఈ మ్యూజియాన్ని మొత్తాన్ని పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చేలా.. లేత గులాబీ రంగులో డిజైన్‌ చేశారు. దీన్ని మొత్తం 14 భాగాలుగా విభజించారు. ఒక్కో భాగాన్ని ఒక్కో ప్రత్యేక థీమ్‌తో తీర్చిదిద్దారు. అవన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయట. ఐస్‌క్రీం మ్యూజియం అనగానే అవి మాత్రమే ఉంటాయనుకోకండి నేస్తాలూ.. ఇక్కడ వివిధ ఐస్‌క్రీంల విశేషాలతోపాటు రకరకాల ఆట వస్తువులు, గేమ్‌ జోన్లు కూడా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే.. ఆ ఆట వస్తువులు కూడా ఐస్‌క్రీం, రకరకాల ఫ్రూట్స్‌ ఆకారంలోనే ఉంటాయి. అందుకే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పిల్లలందరూ ఈ మ్యూజియంకి వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారట.

తిన్నవారికి తిన్నంత..  

రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో ఈ మ్యూజియానికి వెళ్లేందుకు ఒకరోజు ముందుగానే టికెట్‌ కొనాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లిన తరవాత మనకు నచ్చినన్ని ఐస్‌క్రీంలను ఉచితంగానే తినొచ్చట. అంటే టికెట్‌ ధరలోనే అన్నీ కలిపి ఉంటాయి మరి. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద స్ప్రింక్లింగ్‌ పూల్‌ ఉంది. ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి లొకేషన్స్‌కి కొదవే లేదట. కూర్చోవడానికి ఏర్పాటు చేసిన టేబుళ్లేమో ఐస్‌క్రీం ఆకారంలో, కౌంటర్లేమో వాటిని అమ్మే బండ్లలా రూపొందించారు. ఆ మ్యూజియంలోకి వెళ్లాక, ఎటు చూసినా ఐస్‌క్రీంలే కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అదో ఐస్‌క్రీం ప్రపంచం అనుకోండి. నేస్తాలూ.. ఈ ‘ఐస్‌క్రీం మ్యూజియం’ విశేషాలు మీకు నచ్చాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని