ప్రాంతానికో పేరు..అందమైన పక్షిని నేను!

హాయ్‌ నేస్తాలూ.. ఎలా ఉన్నారు.? నేనైతే చాలా బాగున్నా.. సరదాగా మీతో కబుర్లు చెప్పాలనిపించి ఇలా వచ్చాను. ‘అదేంటి.. ఎవరో ఏంటో పరిచయం చేసుకోకుండానే కబుర్ల వరకూ వెళ్లింది?’

Updated : 04 Nov 2023 05:18 IST

హాయ్‌ నేస్తాలూ.. ఎలా ఉన్నారు.? నేనైతే చాలా బాగున్నా.. సరదాగా మీతో కబుర్లు చెప్పాలనిపించి ఇలా వచ్చాను. ‘అదేంటి.. ఎవరో ఏంటో పరిచయం చేసుకోకుండానే కబుర్ల వరకూ వెళ్లింది?’ అని అనుకుంటున్నారా.. ఆ వివరాలు చెప్పిపోదామనే ఈరోజు ఇలా మీ పేజీలోకి వచ్చా. నేను బాతుని.. అంతేకాదు.. ప్రపంచంలోనే అందమైన పక్షిని. ఇంకా.. అబ్బా, అన్నీ ఇక్కడే చెప్పేస్తారు మరి..!  

నన్ను ‘మాండరియన్‌ డక్‌’ అని పిలుస్తారు. చైనా, జపాన్‌, కొరియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాను. ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. నా శరీరం రంగులు రంగులుగా.. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కళ్ల చుట్టూ తెల్లగా, తలపైనేమో ముదురు ఆకుపచ్చ, నీలి, రెక్కలేమో ముదురు గోధుమ రంగులతో చూసేందుకు భలే ఉంటాను. నా ముక్కు అయితే గులాబీ రంగులో ఉంటుంది.

అందమంటే నాదే..

బాతు కదా అని.. నీటిలో దొరికే ఆహారమే తింటుందని అనుకోకండి నేస్తాలూ.. నేల మీద దొరికేవి కూడా లాగించేస్తా. అయినా నాకు నీటిలో పెరిగే మొక్కలంటేనే చాలా ఇష్టం. నోటితో శబ్దాలు కూడా చేయగలను. మాలో ఆడవాటి కంటే మగ పక్షులే చాలా ముచ్చటగా ఉంటాయి. మీకు ఇంకో విషయం తెలుసా.. నేను ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షిని.

ఎగరడమూ వచ్చు..

మీ మనుషులకైనా, మాలాంటి జీవులకైనా తల్లే తొలి గురువు కదా.. అన్నీ అమ్మ దగ్గర్నుంచే నేర్చుకుంటాం.. కానీ, మేము మాత్రం జన్మించిన కొద్దిరోజుల నుంచే ఎగరడం, ఆహార సేకరణ ఇలా అన్నింటినీ సొంతంగానే నేర్చుకుంటాం. నేను ఎంచక్కా గాల్లో కూడా ఎత్తుకు ఎగరగలను. అలా ఎగురుతూ హఠాత్తుగా కిందపడినా, ఎలాంటి గాయాలు కాకుండా నా శరీర నిర్మాణం ఉంటుంది.  

బరువు తక్కువే..

నేను చూడటానికి కాస్త బొద్దుగా కనిపిస్తాను కానీ, బరువు 425 నుంచి 693 గ్రాముల వరకు మాత్రమే ఉంటాను. అన్నీ అనుకూలిస్తే, మా జాతి జీవులు దాదాపు మూడు నుంచి పన్నెండేళ్ల వరకు జీవిస్తాయి. మేం ఒక రోజులో అలుపనేదే లేకుండా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించగలం తెలుసా.. ప్రస్తుతం మా సంఖ్య అయితే వేలల్లోనే ఉంది. ఇవీ నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని