కొండను చీల్చి.. రోడ్డుగా మలిచి..!

నేస్తాలూ.. కొండల మీదుగా వేసిన రోడ్లు చూసుంటారు. గుట్టలను తొలిచి నిర్మించిన సొరంగ మార్గాలనూ చూసే ఉంటారు. కానీ, ఒక పెద్ద కొండనే రెండుగా చీల్చి, వేసిన రహదారిని ఎప్పుడైనా చూశారా?

Published : 07 Nov 2023 01:29 IST

నేస్తాలూ.. కొండల మీదుగా వేసిన రోడ్లు చూసుంటారు. గుట్టలను తొలిచి నిర్మించిన సొరంగ మార్గాలనూ చూసే ఉంటారు. కానీ, ఒక పెద్ద కొండనే రెండుగా చీల్చి, వేసిన రహదారిని ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు మనం అటువంటి దారి గురించే తెలుసుకోబోతున్నాం.. ఆలస్యం చేయకుండా గబగబా చదివేయండి మరి!

క్కువ ఖర్చులో విదేశీయానం అనగానే చాలామందికి టక్కున గుర్తొచ్చే ప్రదేశం బాలి. ఇండోనేషియా దేశంలోని ఈ ప్రాంతం.. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ఇక్కడి పండావా బీచ్‌కు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇతర బీచ్‌లకు భిన్నంగా ఇక్కడి తీరంలో ఉండే తెల్లటి ఇసుక, స్వచ్ఛమైన నీరు దేశవిదేశీయులను ఆకర్షిస్తోంది. అయితే, 2012 వరకు స్థానికులకు మాత్రమే తెలిసిన ఈ ప్రాంతం, ఆ తర్వాత ప్రపంచం మొత్తానికీ పరిచయమైంది. అందుకు కారణం.. కొండను రెండుగా చీల్చి నిర్మించిన రహదారి.

సున్నపురాతి కొండను..

పండావా బీచ్‌కు పర్యాటకులు సాఫీగా రాకపోకలు సాగించేలా ఇండోనేషియా ప్రభుత్వం ఓ రోడ్డును నిర్మించాలనుకుంది. కానీ, చుట్టూ సున్నపురాతి కొండలే ఉండటంతో ఏం చేయాలో అధికారులకు అంతుపట్టలేదు. చాలా కసరత్తుల అనంతరం.. కొండనే రెండుగా చీల్చి, రహదారిని నిర్మించాలనే నిర్ణయానికొచ్చారు. అనుకున్నదే ఆలస్యం.. అదే ప్రణాళికతో కొన్ని ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రభుత్వం రెండేళ్ల వ్యవధిలోనే పనులు పూర్తి చేసింది.

మరి మూగజీవులెలా..?

కొత్తగా నిర్మించిన రహదారిలో పర్యాటకుల తాడికి విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు ఎక్కువమంది బీచ్‌ కంటే ఈ రహదారిని చూసేందుకే వస్తున్నారట. ‘కొండనైతే రెండు ముక్కలు చేశారు సరే.. మరి మూగజీవాల పరిస్థితి ఏంటి?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలా నిట్టనిలువుగా విడగొట్టడంతో జంతువులు అటు ఇటు రాకపోకలు సాగించలేకపోతున్నాయని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. జంతువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండు వైపులా అన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు సమాధానం ఇస్తున్నారు. కొండ మీది నుంచి కిందకు పడిపోకుండా రక్షణ గోడలు కూడా నిర్మించారట.

ఫొటోలు, వీడియోలతో క్రేజ్‌..

ఇప్పటికే టూరిస్టు స్పాట్‌గా మారిన ఈ రోడ్డు.. సోషల్‌ మీడియాలోనూ క్రేజ్‌ సంపాదించుకుంది. పండావా బీచ్‌కు వెళ్లే ఈ రహదారికి సంబంధించిన వీడియోలను ఇటీవల కొందరు ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దాంతో క్షణాల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. ఈ బీచ్‌ ఏరియల్‌ వ్యూను చూసిన వారంతా వావ్‌ అనేస్తున్నారు. నేస్తాలూ.. నిజంగానే ఈ రోడ్డు భలే వింతగా ఉంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని