ఈ పెంగ్విన్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!

హలో ఫ్రెండ్స్‌.. మనకు ఆర్మీలో మేజర్‌, బ్రిగేడియర్‌ తదితర హోదాలు ఉంటాయని తెలుసు. అలాగే, ఓ పెంగ్విన్‌కి కూడా మేజర్‌ జనరల్‌ హోదా ఉందని మీకు తెలుసా? నిజమే నేస్తాలూ..

Published : 09 Nov 2023 00:46 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు ఆర్మీలో మేజర్‌, బ్రిగేడియర్‌ తదితర హోదాలు ఉంటాయని తెలుసు. అలాగే, ఓ పెంగ్విన్‌కి కూడా మేజర్‌ జనరల్‌ హోదా ఉందని మీకు తెలుసా? నిజమే నేస్తాలూ.. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే, ఇది చదివేయండి మరి..!

స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌ జూలో ‘సర్‌ నిల్స్‌ ఓల్వ్‌’ అనే పేరున్న పెంగ్విన్‌ ఒకటుంది. దానికి ప్రస్తుతం 21 సంవత్సరాలు. ఇది మామూలు పెంగ్విన్‌ కాదు.. ఇటీవలే ‘మేజర్‌ జనరల్‌’ హోదాతోపాటు ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకుంది.

దశాబ్దాల క్రితం..

పెంగ్విన్‌ అంటున్నారు.. మేజర్‌ జనరల్‌ హోదా అంటున్నారు.. అసలేం అర్థం కావట్లేదు కదూ.. మేజర్‌ జనరల్‌ అనేది ఆర్మీలో అత్యున్నత హోదాల్లో ఒకటి.

ఆ ర్యాంక్‌ ఉన్న వారి సారథ్యంలో కొన్ని వందల మంది సైనికులు విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే, ఈ పెంగ్విన్‌కి ఆ హోదా ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే.. మనం 1961కి వెళ్లాల్సిందే.

అలా మొదలైంది..

నార్వే రాజు ముఖ్య భద్రతాధికారి ఒకసారి సముద్రతీరానికి వెళ్లాడు. అక్కడ కొన్ని వందల సంఖ్యలో పెంగ్విన్లు ఒకదాని వెంట ఒకటిగా వెళ్లసాగాయి. ఆ వరస సైనికుల కవాతు మాదిరి అనిపించిందట. ఆ తర్వాత ఆయన ఎడిన్‌బర్గ్‌ చేరుకున్నాక.. పెంగ్విన్లలో రకాలు, వాటి జీవన శైలి తదితర అంశాల గురించి తెలుసుకున్నాడు. ఆ జాతిలో రెండో అతిపెద్దవైన కింగ్‌ పెంగ్విన్‌ను తమ భద్రతా దళాలకు మస్కట్‌గా ప్రతిపాదించాడు. అలా అప్పటి నుంచి ‘నార్వే కింగ్స్‌ గార్డ్‌’కు ‘కింగ్‌ పెంగ్విన్‌’ జాతికి చెందిన ఒకదాన్ని మస్కట్‌గా ఎంపిక చేశాడు. దాని తర్వాత ఆ అవకాశం ‘సర్‌ నిల్స్‌ ఓల్వ్‌’కు దక్కింది. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతోంది. ఇన్నేళ్లలో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇటీవల మేజర్‌ జనరల్‌గా పదోన్నతి పొందింది. ఇదంతా ఏదో మాటల్లోనేనని అనుకోకండి నేస్తాలూ.. ఆ పెంగ్విన్‌ ర్యాంక్‌కు చిహ్నంగా అధికారిక బ్యాడ్జ్‌ను దాని రెక్కకు పెట్టారు. ఇప్పటివరకు అది అనేక పతకాలు కూడా సాధించిందట.

ఏ లోటూ లేకుండా..

ఎడిన్‌బర్గ్‌లోని జూలో ఉంటున్న ఈ పెంగ్విన్‌ను ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారు. రాజు భద్రతాధికారి కానీ జూ సిబ్బంది కానీ ఎవరొచ్చినా వారిని గుర్తుపట్టి మరీ ఎంతో ఆప్యాయంగా దగ్గరకు వెళ్తుందట. ఇది మిగతా పెంగ్విన్లలా కాదు కాబట్టి రోజూ బకెట్‌ నిండుగా మేలైన చేపలను, ఇతర పదార్థాలను ఆహారంగా అందిస్తుంటామని, ప్రత్యేక సదుపాయాలూ కల్పిస్తున్నామని జూ సిబ్బంది చెబుతున్నారు. దీనికి గతంలోనే గిన్నిస్‌ రికార్డు వచ్చింది. కానీ, తాజాగా హోదా మారడంతో ఆ పేరు మీదే సంబంధిత ప్రతినిధులు మరో రికార్డును అందించారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని