భలే భలే ‘ఓషన్‌ థీమ్‌ పార్కు’!

హాయ్‌ నేస్తాలూ.. సెలవులు వస్తే చాలు ఏదైనా మనకు నచ్చిన దగ్గరకో లేదా పార్కుకో వెళ్లి ఎంచక్కా ఆడుకోవాలని అనుకుంటాం. పార్కు అనగానే అందమైన చెట్లు, రకరకాల ఆట సామగ్రి, ఫుడ్‌ కోర్టులు... ఇలాంటివే గుర్తుకొస్తాయి కదా..

Updated : 12 Nov 2023 06:39 IST

హాయ్‌ నేస్తాలూ.. సెలవులు వస్తే చాలు ఏదైనా మనకు నచ్చిన దగ్గరకో లేదా పార్కుకో వెళ్లి ఎంచక్కా ఆడుకోవాలని అనుకుంటాం. పార్కు అనగానే అందమైన చెట్లు, రకరకాల ఆట సామగ్రి, ఫుడ్‌ కోర్టులు... ఇలాంటివే గుర్తుకొస్తాయి కదా.. కానీ, మనలాంటి పిల్లలతోపాటు పెద్దలకూ నచ్చేలా కొత్తగా థీమ్‌ పార్కులు వస్తున్నాయి. అలాంటి ఓ పార్కు గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..!

చైనా అంటేనే.. చాలా వింతలు, విశేషాలు గుర్తుకొస్తాయి. పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా షాంఘై ప్రాంతంలో ‘ఓషన్‌ థీమ్‌ పార్కు’ని ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల్లోనే ఇది చైనాలోనే ‘బెస్ట్‌ థీమ్‌ పార్కు’గా గుర్తింపు పొందింది. నది ఒడ్డున 73 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కును కాలిఫోర్నియాకు చెందిన ఓ సంస్థ వాళ్లు డిజైన్‌ చేశారట.

ఒక్కో థీమ్‌తో.. 

అంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును కొన్ని భాగాలుగా విభజించారట. ఒక్కో భాగాన్ని ఒక్కో థీమ్‌తో తీర్చిదిద్దారు. ఇందులో ఆరు జంతు ప్రదర్శనశాలలు, 360 డిగ్రీల్లో ఏర్పాటు చేసిన త్రీడీ గదులు.. ఒక్కటేమిటి ఇలా చాలా అద్భుతంగా పార్కును డిజైన్‌ చేశారు. ఇక్కడుండే హోటళ్లలోని సామగ్రి కూడా రకరకాల జంతువుల ఆకారంలో ఉంటుందట. ఇంకో విషయం ఏంటంటే.. ఈ పార్కులో దాదాపు 30 వేలకు పైగా సముద్ర జీవుల ఆకారాలతో ఏటా ఫ్లోటింగ్‌ పరేడ్‌ నిర్వహిస్తుంటారు. దీన్ని ప్రారంభించిన కొత్తలో రోజుకు దాదాపు లక్ష మంది పర్యాటకులు వీక్షించేవారట. 

బోలెడు అవార్డులు..

ఇక్కడ పిల్లలకు నచ్చే ఆట వస్తువులతోపాటు పెద్దలు ఎంతగానో ఇష్టపడే అడ్వెంచర్‌ గేమ్స్‌ కూడా ఉన్నాయి. ఒక్కరోజులోనే అవన్నీ చూడటం కష్టం కాబట్టి.. రెండు మూడు రోజులు అక్కడే ఉండాలనుకునే వారి కోసం అన్ని వసతులూ కల్పించారు. ఈ పార్కు ఇప్పటికే పలు విభాగాల్లో అవార్డులు కూడా దక్కించుకుంది. ఇక్కడికి వెళ్లాలనుకున్న వారు ఒకరోజు ముందుగానే టిక్కెట్లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెలవు రోజుల్లోనైతే రద్దీ విపరీతంగా ఉంటుందట. సాయంత్రం వేళల్లో ఇక్కడి లైటింగ్‌ చూస్తే, కళ్లు మిరిమిట్లుగొలిపేలా ఉంటుంది. అంటే ఆ చుట్టుపక్కల ఉండేవారికి ప్రతిరోజూ దీపావళే అన్నమాట. నేస్తాలూ.. ఈ పార్కు విశేషాలు భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని