ఆహా.. ఎంత అందమైన చెట్టో..!

హలో నేస్తాలూ.. ఏటా ఒకసారి చెట్ల ఆకులన్నీ రాలిపోయి, మళ్లీ కొత్తగా చిగురిస్తాయి కదా.. దీన్నే ఆకురాలే కాలం అంటారనిమీకు టీచర్లు చెప్పే ఉంటారు. అయితే, ఈ ఆకురాలే కాలంలో ఓ భారీ వృక్షాన్ని చూసేందుకు పర్యాటకులు వరస కడుతున్నారట. మరి ఇంతకీ ఆ చెట్టు ఎక్కడుందో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!

Updated : 15 Nov 2023 04:15 IST

హలో నేస్తాలూ.. ఏటా ఒకసారి చెట్ల ఆకులన్నీ రాలిపోయి, మళ్లీ కొత్తగా చిగురిస్తాయి కదా.. దీన్నే ఆకురాలే కాలం అంటారని మీకు టీచర్లు చెప్పే ఉంటారు. అయితే, ఈ ఆకురాలే కాలంలో ఓ భారీ వృక్షాన్ని చూసేందుకు పర్యాటకులు వరస కడుతున్నారట. మరి ఇంతకీ ఆ చెట్టు ఎక్కడుందో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!

దక్షిణ కొరియాలో బంగ్యే-రి అనే పల్లెటూరు ఒకటుంది. ఆ ఊరిలో ‘జింక్గో బిలోబా’ అనే పేరున్న పెద్ద వృక్షానికి దాదాపు 860 సంవత్సరాల చరిత్ర ఉందట. అంతేకాదు.. ఆ దేశ జాతీయ స్మారకంగానూ దాన్ని గుర్తించారు.

అందమైన వాటిల్లో ఒకటి..

పసుపు రంగు ఆకులతో మిలమిల మెరిసిపోయే ఈ బిలోబా చెట్టు 17 మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 32 మీటర్ల ఎత్తు ఉంటుంది. అలాగని ఆ జాతిలో ఇది అతి పెద్దదేమీ కాదట. కానీ, ఆ చెట్టు కొమ్మలు పెరిగిన విధానమే పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అంతేకాదు.. ప్రపంచంలోని అందమైన వృక్షాల్లో ఇదొకటి. దీనికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి రెస్టరంట్లు, ఇతర సౌకర్యాలు ఏమీ ఉండవట. అయినా, టూరిస్టులు మాత్రం ఇక్కడికి వరస కడుతున్నారు.

కొవిడ్‌ తర్వాత..

కొవిడ్‌ సమయంలో ఎక్కడి వారు అక్కడికే పరిమితమయ్యారు కదా. అయితే, వైరస్‌ ప్రభావం తగ్గిన తర్వాత ప్రజలంతా సొంత వాహనాల్లో ప్రయాణాలకే మొగ్గు చూపారు. దాంతో ఈ బిలోబా చెట్టు అందాలను చూసేందుకు పర్యాటకులు రావడం అధికమైందట. అంతకుముందు ప్రజారవాణాలో అడపాదడపా మాత్రమే ఇక్కడకు వచ్చేవారు. కొవిడ్‌ తర్వాత రద్దీ ప్రాంతాలకు ప్రజలు వెళ్లకపోవడం, కొత్తవారితో కలిసేందుకు అంతగా ఇష్టపడకపోవడంతో సొంత వాహనాల వాడకం పెరిగిపోయింది. దాంతో కుటుంబంలో ముగ్గురు, నలుగురు సభ్యులే ఉన్నవారు.. తమ వాహనాల్లోనే నేరుగా బయటకు వెళ్లడం ప్రారంభించారు. అలా ఈ ఊరికి వచ్చేవాళ్ల సంఖ్య కూడా అధికమైంది. ఎంతలా అంటే.. కొవిడ్‌కు ముందుతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెరిగిందట. వారాంతాలు, సెలవులతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఈ చెట్టును చూసేందుకు ప్రతిరోజూ నాలుగు వేల మంది వరకూ వస్తున్నారని ఆ ఊరి వాళ్లు చెబుతున్నారు. రాలిపోయి భూమి మీద పడిన ఈ చెట్ల ఆకులు ఎల్లో కార్పెట్‌ను తలపిస్తాయట. నేస్తాలూ.. ఈ కలర్‌ఫుల్‌ ట్రీ విశేషాలివీ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు