విరిసినదీ విచిత్ర పుష్పం!

హాయ్‌ నేస్తాలూ..! రంగురంగుల పువ్వులు మనకు భలేగా నచ్చేస్తాయి.. అందులోనూ రకరకాల ఆకారాల్లో ఉన్నవి చాలానే ఉంటాయి కదా..!

Updated : 17 Nov 2023 05:36 IST

హాయ్‌ నేస్తాలూ..! రంగురంగుల పువ్వులు మనకు భలేగా నచ్చేస్తాయి.. అందులోనూ రకరకాల ఆకారాల్లో ఉన్నవి చాలానే ఉంటాయి కదా..! కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పువ్వు మాత్రం మరింత విచిత్రమైంది. ఇది అచ్చం గబ్బిలంలా ఉంటుంది. ఇంతకీ ఈ పువ్వు పేరేంటి? ఇది ఎక్కడ కనిపిస్తుంది? దాని ప్రత్యేకతలేంటి?... ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందామా మరి...!

ప్పటి వరకు మనం మాట్లాడుకున్న పువ్వు పేరు ‘బ్లాక్‌ బ్యాట్‌ ఫ్లవర్‌’. అదేంటి ఇలా ఉంది పేరు అనుకుంటున్నారా? అంటే.. ఈ పువ్వు చూడటానికి అచ్చం గబ్బిలంలా ఉంటుందన్నమాట. రెక్కలేమో గబ్బిలం రెక్కల్లా, పైన ఉండే గింజలేమో దాని కళ్లలా ఉంటాయి. దీన్ని డెవిల్‌ ఫ్లవర్‌ అని కూడా పిలుస్తారు. ఇది ఆస్ట్రేలియా, ఆసియా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని చోట్ల ఈ మొక్కను పెంచడం సాధ్యం కాదట. ఈ పువ్వు మొదట ముదురు మెరూన్‌ రంగులో ఉంటుంది. మెల్లమెల్లగా అది ముదురు పర్పుల్‌లోకి మారుతుంది. కానీ, చూసేవాళ్లకు మాత్రం నలుపు రంగులా కనిపిస్తుంది.

చలి ఉండకూడదు..!

ఈ పువ్వుల్లో మొత్తం 15 రకాలున్నాయి. ఇవి నేరుగా వచ్చితాకే సూర్యకిరణాలను తట్టుకోలేవు. ఎక్కువ చలి తగిలినా తొందరగా వాడిపోతాయి. కాస్త తక్కువ ఉష్ణోగ్రత ఉన్న చోట.. అంటే వెలుతురులో ఉంటే సరిపోతుందన్నమాట. నీడలో చక్కగా పెరుగుతాయి. ఒకవేళ ఎక్కువ చలిలో ఉంచితే దాని వేర్లకు తెగుళ్లు వచ్చి మొక్క తొందరగా చనిపోతుంది. అవసరమైన వాతావరణాన్ని అందిస్తే.. ఇంట్లో కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు. వేసవి నుంచి వర్షాకాలం పూర్తయ్యే వరకు ఇవి  పుష్పిస్తాయి.

పత్రాలే పెద్దవి..!

మరో విషయం ఏంటంటే.. దీన్ని పిల్లి మీసాల పువ్వు అని కూడా పిలుస్తారట. ఈ పువ్వులు 12 అంగుళాల వెడల్పు, 36 అంగుళాల పొడవు వరకు పెరుగుతాయి. పువ్వులే అనుకుంటే, ఈ మొక్క పత్రాలు ఇంకా పొడవుగా ఉంటాయట. ఈ ‘బ్లాక్‌ బ్యాట్‌ ఫ్లవర్‌’ విశేషాలు భలే ఉన్నాయి కదా నేస్తాలూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని