చెదపురుగులే ఆహారం! బొరియలే ఆవాసం!!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా! నన్ను చూసి మీరు అడ్డుగీతలున్న ఉడుత అనుకుంటున్నారు కదూ! హి...హి..హి.. అలా అయితే మీరు తప్పులో కాలేస్తున్నట్లే!

Published : 20 Nov 2023 00:03 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా! నన్ను చూసి మీరు అడ్డుగీతలున్న ఉడుత అనుకుంటున్నారు కదూ! హి...హి..హి.. అలా అయితే మీరు తప్పులో కాలేస్తున్నట్లే! ఎందుకంటే నేను ఉడుతను కానేకాదుగా! మరింతకీ నేనెవర్ని? నా ప్రత్యేకతలేంటి? అసలు నా కథేంటి?... ఇలాంటి వివరాలన్నీ మీకు తెలుసుకోవాలని ఉంది కదూ! ఆ వివరాలు చెప్పి పోదామనే ఇదిగో ఇలా వచ్చాను. తెలుసుకుంటారా మరి!

నా పేరు నాంబాట్‌. నేను ఆస్ట్రేలియాకు చెందిన జీవిని. నన్ను వాల్పూర్తి అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు మేం ఏ ఇబ్బందీ లేకుండా.. ఇబ్బడిముబ్బడిగా ఉండేవాళ్లం. కానీ ప్రస్తుతం మా సంఖ్య చాలా తక్కువగా ఉంది. మేం అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేరిపోయాం.

చిరుజీవులం..

నా రంగు ఎరుపు, గోధుమలు కలగలిసినట్లుగా ఉంటుంది. వీపు మీద నలుపు, తెలుపు చారలుంటాయి. కళ్ల పైన చిన్న నల్లగీత ఉంటుంది. చెవులు సన్నగా, సూటిగా ఉంటాయి. నేను 7 నుంచి 12 అంగుళాల పొడవుంటాను. తోకేమో 4 నుంచి 8 అంగుళాల వరకు పొడవు పెరుగుతుంది. నా తోక అచ్చం ఉడుత తోకలా ఉంటుంది. అందుకే చాలా మంది నన్ను ఉడుత అనుకొని పొరపాటు పడుతుంటారు.

పొడవైన నాలుక...

నేను చెదపురుగులను తిని నా బుజ్జి బొజ్జ నింపుకొంటాను. నా నాలుక చాలా పొడవుగా ఉంటుంది. నాకు దంతాలైతే ఉన్నాయి కానీ.. అవి మరీ అంత బలమైనవేమీ కాదు. నేను నాలుక ద్వారా చెదపురుగులను పట్టుకుని నోట్లో వేసుకుంటాను. నమలకుండానే నేరుగా మింగేస్తాను. ఓ రకంగా నేనూ యాంట్‌ఈటర్‌నే అన్నమాట. గంటకు 20 మైళ్ల వరకు వేగాన్ని అందుకోగలను. బొరియల్లో నివసిస్తాను. అన్నట్లు చెట్లను కూడా ఎక్కగలను తెలుసా!

చాలా చురుకు...

నేను చాలా చురుగ్గా ఉంటాను. రోజుకు దాదాపు 20వేల వరకు చెదపురుగులను తింటాను. ఇది నా సొంత బరువులో పదోవంతుకు సమానం. మేం ఒకప్పుడు దక్షిణ ఆస్ట్రేలియా, న్యూసౌత్‌వేల్స్‌, విక్టోరియాలో నివసించేవాళ్లం. కానీ ప్రస్తుతం కేవలం పశ్చిమ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాం.

శత్రువులే.. శత్రువులు...

నా జీవిత కాలం అయిదు సంవత్సరాలు. అది కూడా ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. నేను చాలా చిరుజీవిని కాబట్టి, నాకు శత్రువులు చాలా ఎక్కువ. డేగలు, గద్దలు, కొండచిలువలు, పాములు, నక్కలు, పిల్లులు, కుక్కలు నేను కనబడితే చాలు వేటాడి తినేస్తాయి. వీటన్నింటిని తప్పించుకుంటూ, నెట్టుకురావడమంటే మాటలు కాదు మరి. నేస్తాలూ..! ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. చెదపురుగుల్ని తినే వేళైంది. ఇక ఉంటామరి.. బై.. బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని