కూ.. చుక్‌.. చుక్‌.. హలో కిట్టీ..!

వేగం అంటేనే బుల్లెట్‌ రైలు! బుల్లెట్‌ రైలు అంటేనే జపాన్‌!! అలాంటి దేశంలో ఓ ప్రత్యేక బుల్లెట్‌ రైలు నడుస్తోంది.

Updated : 21 Nov 2023 03:42 IST

వేగం అంటేనే బుల్లెట్‌ రైలు! బుల్లెట్‌ రైలు అంటేనే జపాన్‌!! అలాంటి దేశంలో ఓ ప్రత్యేక బుల్లెట్‌ రైలు నడుస్తోంది. అదంటే అక్కడ మనలాంటి బుజ్జాయిల దగ్గర్నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమే. మరి ఆ బుల్లెట్‌ రైలు ప్రత్యే‘కథ’ ఏంటో తెలుసుకుందామా!

ఆ ప్రత్యేక బుల్లెట్‌ ట్రైన్‌ పేరు హలో కిట్టీ షింకాన్‌షేన్‌. ఈ కూ.. చుక్‌..చుక్‌.. బండిని హలో కిట్టీ థీమ్‌తో రూపొందించారు. హలో కిట్టీ అనేది ఓ యానిమేషన్‌ పాత్ర. ఇదంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టం. ఈ ట్రైన్‌ కొన్ని సంవత్సరాల క్రితమే పట్టాలెక్కింది. తర్వాత కొంతకాలం ఆగిపోయింది! కానీ దీనికున్న ప్రజాదరణ దృష్ట్యా మళ్లీ ప్రారంభమైంది. ఈ హలో కిట్టీ షింకాన్‌షేన్‌ రైలు షిన్‌- ఒసాకా స్టేషన్‌ నుంచి హకటా స్టేషన్ల మధ్య నడుస్తోంది.

క్యూట్‌ క్యాట్‌...!

హలో కిట్టీ షింకాన్‌షేన్‌ రైలు చాలా క్యూట్‌గా ఉంటుంది. ట్రైనంతా హలో కిట్టీ స్టిక్కర్లు, బొమ్మలతో అలంకరించి ఉంటుంది. రైలు నేల కూడా గులాబి రంగులో ఉంటుంది. కిటికీలకు కూడా హలో కిట్టీ చిత్రాలుంటాయి.

రెండు ప్రత్యేక బోగీలు!

ఈ రైలులో హలో ప్లాజా, కవాయ్‌ రూమ్‌ అనే పేరుతో రెండు ప్రత్యేక బోగీలుంటాయి. హలోప్లాజా బోగీలో అయితే అసలు సీట్లే ఉండవు. ప్రత్యేక బెంచీల్లాంటి ఏర్పాట్లు మాత్రం ఉంటాయి. ఇక్కడ ముద్దుముద్దుగా ఉండే పలు రకాల హలో కిట్టీ బొమ్మలు, బుల్లి బుల్లెట్‌ ట్రైన్‌ బొమ్మలు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ఇంకా రుచికరమైన మిఠాయిలు, తిండిపదార్థాలు లభిస్తాయి. అందుకే చిన్నారులంతా ఈ బోగీ అంటే తెగ ఇష్టపడతారు. ఇంకా ప్రత్యేకంగా రిజర్వ్‌ చేసుకున్న వారికి.. మూడు నుంచి ఎనిమిదో నంబరు వరకున్న బోగీల్లో, దాగి ఉన్న హలో కిట్టీ బొమ్మలను గుర్తించే ప్రత్యేక టాస్క్‌ కూడా ఉంటుందట. ఈ కథనం అంతా చదివాక మన దగ్గర కూడా ఇలాంటి ఓ రైలు ఉంటే బాగుండేది అనిపిస్తోంది కదూ! నేస్తాలూ.. మొత్తానికి ఇవీ హలో కిట్టీ షింకాన్‌షేన్‌ విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని