ఎలుగుబంటి + పిల్లి + కోతి = నేను!

ఏంటీ లెక్క అని చూస్తున్నారు కదూ! నా లెక్కే వేరు మరి! ఎలుగుబంటి, పిల్లి, కోతిని మిక్సీలో వేసి తీసినట్లుంటాను నేను. చాలా విచిత్రంగా ఉన్నాను కదూ! అందుకే నా గురించి మీతో చెప్పి పోదామని ఇదిగో ఇలా వచ్చాను. నా విశేషాలు తెలుసుకుంటారా మరి!

Published : 23 Nov 2023 00:33 IST
ఏంటీ లెక్క అని చూస్తున్నారు కదూ! నా లెక్కే వేరు మరి! ఎలుగుబంటి, పిల్లి, కోతిని మిక్సీలో వేసి తీసినట్లుంటాను నేను. చాలా విచిత్రంగా ఉన్నాను కదూ! అందుకే నా గురించి మీతో చెప్పి పోదామని ఇదిగో ఇలా వచ్చాను. నా విశేషాలు తెలుసుకుంటారా మరి!
వును ఇంతకీ నా పేరేంటో చెప్పనేలేదు కదూ! నన్ను బింటూరాంగ్‌ అని పిలుస్తారు. నాకు బేర్‌క్యాట్‌ అనే పేరు కూడా ఉంది. నేను చాలా అరుదైన జీవిని. మా సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతోంది. మేం భారతదేశం, నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మయన్మార్‌, థాయిలాండ్‌, మలేషియా, చైనా, కంబోడియా, వియత్నాం, ఇండోనేషియా, జావా, ఫిలిప్పీన్స్‌ దేశాలలో జీవిస్తుంటాం. మీ దగ్గర అయితే అసోంలో కనిపిస్తుంటాం.  

ఏదైనా తినేస్తా..

నేను శాకాహారం, మాంసాహారం ఏమైనా తినేస్తాను. చిన్నచిన్న క్షీరదాలు, చేపలు, వానపాములు, కీటకాలు, ఎలుకల్నీ కరకరలాడించేస్తాను. ఇంకా పండ్లను కూడా తింటాను. నేను చేపలు, వానపాముల్ని ఎక్కువగా తినను. నాకు మరీ ఆకలిగా ఉన్నప్పుడు, ఏ ఆహారం అందుబాటులో లేనప్పుడు మాత్రమే వీటిని తింటాను. మరో విషయం ఏంటంటే నాకు మాంసాహారం కంటే కూడా శాకాహారం అంటేనే ఎక్కువ ఇష్టం. పండ్లే నాకు ప్రధాన ఆహారం. ముఖ్యంగా అరటిపండ్లంటే నాకు భలే ఇష్టం. పక్షులు, గుడ్లను కూడా లొట్టలేసుకు తినేస్తాను.

నేనూ బాహుబలినే!

నా కాళ్లు పొట్టిగా, బలిష్టంగా ఉంటాయి. నా జుట్టు నల్లగా, మందంగా ఉంటుంది. నా కళ్లు పెద్దగా, నల్లగా ఉంటాయి. చెవులేమో పొట్టిగా, గుండ్రంగా... తెల్లటి అంచులతో ఉంటాయి. నా శరీరం పొడవు 71 నుంచి 84 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇక తోకేమో 66 నుంచి 69 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. బరువేమో 11 నుంచి 32 కిలోల వరకు తూగుతాను. పర్యావరణ మార్పులు, వేట, స్మగ్లింగ్‌, అడవుల నరికివేత మా పాలిట శాపాలుగా మారుతున్నాయి. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి బై.. బై...!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని