రాస్తోగి.. పుస్తకాలు రాస్తున్నాడు!

హాయ్‌ నేస్తాలూ..! మీరు ఇప్పటి వరకు ఏవైనా పుస్తకాలు రాశారా? అని ఎవరైనా అడిగితే.. ‘స్కూల్‌ నుంచి వచ్చి హోంవర్క్‌ చేసుకొని, కాసేపు చదువుకునే సరికే సమయం గడిచిపోతోంది. ఇంకా పుస్తకాలు రాయడమేంటి? అయినా పుస్తకాలు పెద్దవాళ్లు రాస్తారు కదా?’ అనేస్తాం.. కదూ!

Updated : 24 Nov 2023 05:21 IST

హాయ్‌ నేస్తాలూ..! మీరు ఇప్పటి వరకు ఏవైనా పుస్తకాలు రాశారా? అని ఎవరైనా అడిగితే.. ‘స్కూల్‌ నుంచి వచ్చి హోంవర్క్‌ చేసుకొని, కాసేపు చదువుకునే సరికే సమయం గడిచిపోతోంది. ఇంకా పుస్తకాలు రాయడమేంటి? అయినా పుస్తకాలు పెద్దవాళ్లు రాస్తారు కదా?’ అనేస్తాం.. కదూ! కానీ ఒక అన్నయ్య మాత్రం ఒకవైపు చదువుకుంటూనే... తనకు దొరికిన ఖాళీ సమయాల్లో పుస్తకాలు రాస్తున్నాడు. తన రచనలు కొందరిలోనైనా స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నాడు.. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ముంబయికి చెందిన కర్ణవ్‌ రాస్తోగికి 14 సంత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సాధారణంగా ఆ వయసు పిల్లలు స్కూలు నుంచి వచ్చాక హోంవర్క్‌ చేసుకోవడానికే సమయం సరిపోవట్లేదని అంటుంటారు. కానీ కర్ణవ్‌ మాత్రం ఏకంగా 11 పుస్తకాలు రాశాడు. అందులో ఏడు పుస్తకాలు ఆంగ్లం, మిగిలినవి మరాఠీలో రాశాడట. ఆశ్చర్యంగా ఉంది కదూ..! కానీ నిజమే నేస్తాలూ.. తనకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే మొదటి పుస్తకాన్ని ప్రచురించాడు. దానికి ‘కార్తీక్‌ అండ్‌ మిక్సీ.. ది జర్నీ ఎబౌట్‌ క్రియేషన్‌’ అని పేరు పెట్టాడు. ఆ పుస్తకాన్ని ఆన్‌లైన్‌ వేదికగా అమ్మకానికి పెట్టాడు. అతి తక్కువ కాలంలోనే వందల కాపీలు అమ్ముడయ్యాయట.

ప్లాస్టిక్‌తో నష్టాలు..!

ఇన్ని పుస్తకాలు రాశాడని చెబుతున్నారు... కానీ ఇంతకీ దేనికి సంబంధించినవో చెప్పట్లేదని ఆలోచిస్తున్నారా?.. ఇప్పుడు అదే తెలుసుకోబోతున్నాం.. ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలేంటో, మనకు అది ఎంత హాని తలపెడుతుందో కర్ణవ్‌ తన పుస్తకాల్లో వివరించాడు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమ స్ఫూర్తితో ‘మ్యాజిక్‌ డస్ట్‌బిన్‌’ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. తను రాసిన పుస్తకాలన్నీ ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలు, వాతావరణంలో వచ్చే మార్పులను ఎదుర్కోవడం వంటి అంశాలతోనే ముడిపడి ఉన్నాయి.

17 మందిలో ఒకడు..

ఈ అంశాల మీద అవగాహన కల్పించడానికి మన కర్ణవ్‌ ‘ఆథర్‌ ఇన్‌ యూ’ పేరుతో వర్క్‌షాప్స్‌ కూడా నిర్వహించాడు. ఇంకో విషయం ఏంటంటే.. 2023 సంవత్సరంలో ‘ఇంటర్నేషనల్‌ యంగ్‌ ఎకో- హీరో’ అవార్డునూ అందుకున్నాడు. ఇది పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న పిల్లలకు అందిస్తారు. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 17 మందిని ఎంపిక చేస్తే అందులో మన కర్ణవ్‌ కూడా ఉన్నాడు. అంతే కాకుండా ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన ‘అన్‌స్టాపబుల్‌ 21’లోనూ తనకు స్థానం దక్కింది. కర్ణవ్‌ మరెన్నో రచనలు చేసి, ఇంకా అవార్డులు అందుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని