బొరియల్లో బజ్జుంటా! కలుగుల్లో బతికేస్తా!!

హాయ్‌ నేస్తాలు బాగున్నారా! ఏంటి అలా వింతగా చూస్తున్నారు. నేను ఎవరనా?! నేను కూడా మీతో నేనెవరో చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

Published : 27 Nov 2023 00:11 IST

హాయ్‌ నేస్తాలు బాగున్నారా! ఏంటి అలా వింతగా చూస్తున్నారు. నేను ఎవరనా?! నేను కూడా మీతో నేనెవరో చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. నా పేరు.. ఊరు.. తీరు.. తెలుసుకోవాలని మీరు తెగ ఉబలాడపడుతున్నారని నాకు తెలుసు కానీ!! ఎంచక్కా ఈ కథనం చదివేయండి... మీ అనుమానాలన్నీ తీరిపోతాయి. అదే సమయంలో నేనెవరో, ఏంటో కూడా తెలుస్తుంది. సరేనా!!

ముద్దుగా బొద్దుగా ఉన్న నాపేరు వాంకోవర్‌ ఐలాండ్‌ మార్మోట్‌. నేనో ఎలుకజాతి జీవిని. కెనడాకు చెందిన ప్రాణిని. నేను కేవలం బ్రిటిష్‌ కొలంబియాలోని వాంకోవర్‌ ద్వీపంలోని ఎత్తైన పర్వతాల్లో మాత్రమే కనిపిస్తాను. నేను మూడు నుంచి ఏడు కిలోల వరకు బరువు తూగుతాను. 2003లో దాదాపు అంతరించిపోయిన స్థితికి చేరుకున్నాను. అప్పుడు అడవుల్లో మా జనాభా కేవలం 30 మాత్రమే. కానీ 2015 నాటికి మా సంఖ్య 250 నుంచి 300 వరకు పెరిగింది. ప్రస్తుతం ఇంకాస్త పెరిగింది.

శాకాహారులం...

మేం పక్కా శాకాహారులం. బొరియల్లో నివసిస్తాం. కలుగులతో మేం చిన్న చిన్న కాలనీలు నిర్మించుకుని జీవిస్తాం. వాంకోవర్‌ ద్వీపంలో ఉన్న దాదాపు 30 రకాల మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాం. మరో విషయం ఏంటంటే మేం సంవత్సరంలో దాదాపు 210 రోజులు శీతాకాలం కారణంగా నిద్రాణ స్థితిలోనే ఉంటాం. ఈ సమయంలో మేం మా బరువులో మూడింట ఒకవంతును కోల్పోతాం. నిద్ర నుంచి బయటకు వచ్చాక తిరిగి తిని మా పూర్వ స్థితికి చేరుకుంటాం.

పదేళ్లే నిండు నూరేళ్లు!

మా జీవిత కాలం కేవలం పది సంవత్సరాలు మాత్రమే. అందులోనూ చాలా భాగం నిద్రలోనే గడిపేస్తాం. మేం ముదురు చాక్లెట్‌ రంగులో ఉంటాం. మాలో కొన్నింటికి అక్కడక్కడా తెల్లని మచ్చలు కూడా ఉంటాయి. మాలో ఆడవి మూడు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిస్తాయి. అవి పుట్టినపుడు వాటికి కళ్లు కనిపించవు. కొన్ని రోజులయ్యాక అవి బాహ్య ప్రపంచాన్ని చూడగలుగుతాయి. గోల్డెన్‌ ఈగల్స్‌ మాకు ప్రధాన శత్రువులు. అవి మమ్మల్ని వేటాడి తినేస్తాయి. పర్వత సింహాలుగా పేరున్న కూగర్‌, తోడేళ్లు కూడా మాకు శత్రువులే. వీటికి కనిపించామంటే అంతే.. మమ్మల్ని చంపేస్తాయి. వీటితోపాటు పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత కూడా మా జనాభా పెరుగుదల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. నేస్తాలూ....! మొత్తానికి ఇవీ మా విశేషాలు ఇక ఉంటామరి.. బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని