పిట్ట కొంచెం... ప్రతిభ ఘనం!

ముచ్చటగా మూడేళ్లైనా నిండలేదు. అయినా తన ముద్దుముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకుంటోంది. బుజ్జిబుజ్జి పలుకులతో శ్లోకాలు చదివి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో పుస్తకాలతో దోస్తీ చేస్తోంది.

Updated : 29 Nov 2023 05:03 IST

ముచ్చటగా మూడేళ్లైనా నిండలేదు. అయినా తన ముద్దుముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకుంటోంది. బుజ్జిబుజ్జి పలుకులతో శ్లోకాలు చదివి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో పుస్తకాలతో దోస్తీ చేస్తోంది. పాప ప్రతిభకు తల్లి ప్రోత్సాహం తోడవడంతో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? తన పేరేంటి? ఇలాంటి వివరాలు తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే ఇంకెందుకాలస్యం... ఈ కథనం చదివేయండి మరి.

చిచ్చర పిడుగు ధన్విత శ్రీసాయికి ప్రస్తుతం రెండు సంవత్సరాల పదకొండు నెలలు! బుడిబుడి అడుగులతో ఇప్పుడిప్పుడే ప్లే స్కూల్‌కు వెళ్తోంది. ఈ బుడత తన ప్రతిభతో రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. ఈ చిన్నారికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఒకసారి ఏదైనా చెబితే, విని వెంటనే నేర్చుకుంటుంది. అలాగే పుస్తకాలంటే భలే ఇష్టం. సరిగా చదవడం రాకున్నా సరే... వాటితోనే రోజంతా కాలక్షేపం చేస్తుంది.

అమ్మ ప్రోత్సాహంతో...

చిన్నారి శ్రీ వాళ్ల నాన్న పేరు తాడాల శ్రీను. తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తుంటారు. అమ్మ లక్ష్మీ నాగ సంతోషి గృహిణి. వీరిది తూర్పుగోదావరి జిల్లా, కొమరిగిరిపట్నం. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. తమ పాపకు అపారమైన జ్ఞాపకశక్తి ఉందని మొదట తండ్రి గుర్తిస్తే, తల్లి మరింతగా తీర్చిదిద్దుతున్నారు. అమ్మ ఏదైనా చెబితే చాలు.. చిన్నారి టక్కున నేర్చుకుంటుంది. ఇలా ఇప్పటి వరకు 40కి పైగా శ్లోకాలు నేర్చుకుంది. రంగులు, జంతువులు, వాటి అరుపులు, వాహనాలను గుర్తిస్తుంది. రాష్ట్ర్రాలు, దేశాలు, వాటి రాజధానుల పేర్లు, దేవుళ్లు, కూరగాయల పేర్లను చకచకా చెప్పేస్తుంది.

పూజ చేస్తుంటే చూసి...

తల్లి పూజలు చేస్తుంటే చిన్నారి ఆసక్తిగా గమనించేది. అమ్మ చదివిన శ్లోకాలను వెంటనే తిరిగి పలికేది. దీంతో తమ కూతురులో ఉన్న ప్రత్యేక ప్రతిభను గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించారు. పాకడం రాని పిల్లలు కూడా నేడు చరవాణి చెరలో చిక్కుకుపోతున్నారు. అందుకే తమ కూతురుకు సెల్‌ఫోన్‌ అలవాటు కాకుండా ఉండటం కోసం ఆమె చిన్న చిన్న పద్యాలు, శ్లోకాలు, భక్తిపాటలు నేర్పించారు. ధన్విత శ్రీసాయి కూడా వాటిని వెంటనే నేర్చుకునేది. తన ప్రతిభతో ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించుకుంది.

బాలయ్య మెచ్చిన బాల!

చిన్నారి శ్రీ తెలివితేటలకు, సాధించిన రికార్డులను సినీ హీరో బాలకృష్ణ ముగ్ధుడయ్యారు. ఓ వేదిక మీద చిన్నారికి జ్ఞాపికలను అందించి అభినందించారు. భవిష్యత్తులో మరింతగా ప్రతిభ చాటాలని, రికార్డులు సృష్టించాలని ఆశీర్వదించారు. మరి మనమూ చిన్నారి ధన్విత శ్రీ సాయికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని