అరుదైన కోతిని నేను!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! ఏంటి అలా వింతగా చూస్తున్నారు? అవును కదూ..! వింతను వింతగా కాకుండా ఇంకెలా చూస్తారు?! నన్ను చూడగానే, నేను కోతిని అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు

Published : 30 Nov 2023 00:00 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! ఏంటి అలా వింతగా చూస్తున్నారు? అవును కదూ..! వింతను వింతగా కాకుండా ఇంకెలా చూస్తారు?! నన్ను చూడగానే, నేను కోతిని అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కానీ ఏదో తేడాగా ఉందబ్బా అని ఆలోచనలో పడతారు. అవును నిజమే.. నేను మామూలు వానరాల్లా కాకుండా... నలుపు, తెలుపు వర్ణాల్లో ఉంటాను. మరో విషయం ఏంటంటే అత్యంత అరుదైన కోతిని. మరింతకీ మా పేరేంటి? మేం ఎక్కడ నివసిస్తామో తెలుసుకోవాలని ఉంది కదూ!

నా పేరు టోంకిన్‌ స్నబ్‌- నోస్డ్‌ మంకీ. నన్ను డాల్‌మ్యాన్స్‌ స్నబ్‌- నోస్డ్‌ మంకీ అని కూడా పిలుస్తారు. ఈ రెండు పేర్లూ పలకడానికి కష్టంగానే ఉన్నాయి కదూ! మీరైతే ఎంచక్కా నన్ను విచిత్ర కోతి అని పిలుచుకోండి... ఏం ఫర్వాలేదు. నేనైతే ఏమీ అనుకోను. నేను కేవలం వియత్నాంలో మాత్రమే కనిపిస్తాను. నాకు నలుపు, తెలుపు రంగు వెంట్రుకలుంటాయి. నా శరీరంలో ముందు వైపంతా తెలుపు రంగులో ఉంటే, వెనక భాగమంతా నలుపు రంగులో ఉంటుంది.

 ఎంచక్కా ఎత్తులో...

 మేమంతా సముద్ర మట్టానికి 200 నుంచి 1,200 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో జీవిస్తుంటాం. మా ఉనికిని మొదటిసారిగా 1912లో కనుగొన్నారు. మేం చాలా చాలా అరుదైన జీవులం. 2008లో మా జనాభా కేవలం 250 మాత్రమే. ప్రస్తుతం ఇంకా తగ్గి ఉంటుంది. అడవుల నరికివేత, వేట మాకు ప్రధాన ముప్పులుగా ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ వాళ్లు మమ్మల్ని తీవ్రంగా అంతరించిపోతున్న జాతిగా గుర్తించారు.

పొడవైన తోక..

మాకు గులాబీరంగులో ఉండే ముక్కు, మందమైన పెదవులు, కళ్ల చుట్టూ కాస్త నీలిరంగు చర్మం ఉంటుంది. మేం 51 నుంచి 65 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాం. ఇక మా తోకేమో 66 నుంచి 92 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. మాలో ఆడవాటి బరువు దాదాపు 8కిలోలు ఉంటే, మగవాటి బరువు 14 కిలోల వరకు ఉంటుంది.

ఏం తింటామంటే...

మేం మిగతా కోతుల్లానే ఆకులు, పండ్లు, పువ్వులు, గింజల్ని ఆహారంగా తీసుకుంటాం. రోజంతా చురుకుగా ఉంటాం. రాత్రిపూట ఎంచక్కా బజ్జుంటాం. మా జీవితకాలం 20 సంవత్సరాలు. మమ్మల్ని కంటికిరెప్పలా ఎవరైనా చూసుకోవాలి కానీ, మరో తొమ్మిది సంవత్సరాలూ హాయిగా బతికేస్తాం. నేస్తాలూ... మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటామరి... బై.. బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని