ఏంటో... ఈ అంతుచిక్కని గీతలు!!

అవన్నీ గీతలు. ఎవరు గీశారో తెలియదు. పోనీ పిచ్చి గీతలా అంటే కానే కాదు.. అవన్నీ చెక్కుచెదరని చక్కని చిత్రాలే! కోతి.. సాలీడు.. హమ్మింగ్‌ బర్డ్‌... ఇలా పలు బొమ్మలు!

Updated : 01 Dec 2023 04:38 IST

అవన్నీ గీతలు. ఎవరు గీశారో తెలియదు. పోనీ పిచ్చి గీతలా అంటే కానే కాదు.. అవన్నీ చెక్కుచెదరని చక్కని చిత్రాలే! కోతి.. సాలీడు.. హమ్మింగ్‌ బర్డ్‌... ఇలా పలు బొమ్మలు! ఎప్పుడో ప్రాచీన కాలంలో నేల మీద చెక్కినవి! ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఇంతకీ అవన్నీ ఎక్కడ ఉన్నాయి. ఇంకా వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలని ఉంది కదూ నేస్తాలూ! అయితే ఇంకెందుకాలస్యం... ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది.

క్షిణ అమెరికాలోని పెరూలోని దక్షిణ భూభాగంలోని నజ్కా ఎడారిలో ఉన్నాయి ఈ గీతలు. అందుకే వీటిని నజ్కా లైన్స్‌ అని పిలుస్తారు. వీటిని పురాతన నజ్కా నాగరికతకు చెందిన ప్రజలు సృష్టించారని నమ్ముతారు. వీటిని పై నుంచి చూస్తే అవి కేవలం గీతలు కాదు.. బొమ్మలని తెలుస్తాయి. ఇవి నజ్కా, పాల్పా పట్టణాల మధ్య కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.

వేల సంవత్సరాలుగా...

ఈ నజ్కా గీతలు కొన్ని వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ ఎడారిలో వర్షపాతం లేకపోవడంతో ఈ చిత్రాలు అలాగే భద్రంగా ఉన్నాయి. గాలికోత లేకపోవడం కూడా మరింతగా కలిసి వచ్చింది. మొత్తానికి ఇక్కడి ప్రత్యేక వాతావరణమే ఈ నజ్కా లైన్స్‌ను పరిరక్షిస్తోంది అన్నమాట.

ఇంకా ఉన్నాయి!

ఈ నజ్కా గీతలను ఇప్పటికీ కనుగొంటున్నారు. ఇంకా కొన్ని కనుగొనాల్సి ఉందని కూడా పరిశోధకులు భావిస్తున్నారు. 2020 సంవత్సరంలో డ్రోన్ల సాయంతో, కొన్ని ఈ బొమ్మలను కనిపెట్టారు. అసలింతకీ ఈ చిత్రాలు ఎలా రూపుదిద్దుకున్నాయంటే... పురాతన నజ్కా ప్రజలు ఎడారి ఉపరితలం మీద కప్పి ఉన్న ఎర్రటి, గోధుమ రంగులో ఐరన్‌ ఆక్సైడ్‌ పూతతో కూడిన గులకరాళ్లను తొలగించారు. అది కూడా కచ్చితంగా బొమ్మలు గీసినట్లుగా చేశారు. ఎటువంటి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో అంత పెద్ద స్థలాల్లో ఇంత కచ్చితంగా ఎలా బొమ్మల ఆకృతి వచ్చేలా చేశారో ఇప్పటికీ మిస్టరీనే. వీటిని 1994లో యునెస్కో వాళ్లు వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించారు.

గాల్లో తేలుతూ...

నజ్కా ప్రజలు ఈ గీతలు గీయడం వెనక పలు కారణాలున్నట్లు ఊహాగానాలున్నాయి. ఎక్కువమంది విశ్లేషకులు మాత్రం దైవరాధనలో భాగంగా, నాటి ప్రజలు ఇలా చేసి ఉండొచ్చని చెబుతున్నారు. మరి కొందరేమో.. నీటి సరఫరా కోసం ఇలాంటి గీతలు గీసి ఉంటారని ఊహిస్తున్నారు. కారణాలేమైనా ఈ వింతను చూడ్డానికి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ వారిని నేరుగా ఈ ఎడారిలోకి అనుమతించరు. చిన్న చిన్న విమానాల్లో వారంతా ఎగురుతూ ఈ చిత్రాలను చూసి ఆశ్చర్యపోతుంటారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ.. అంతు చిక్కని గీతల విశేషాలు! భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని