వలయం కాదు వంతెనే!

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఈ చిత్రాలు చూస్తే.. ఏదో శిలా తోరణంలా కనిపిస్తోంది కదూ. ప్రకృతి వింతలా అనిపిస్తోంది కదా! కానీ కాదు...!! అవును నేస్తాలూ.. ఇది మానవ నిర్మిత రాతి వంతెన.

Updated : 04 Dec 2023 05:28 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఈ చిత్రాలు చూస్తే.. ఏదో శిలా తోరణంలా కనిపిస్తోంది కదూ. ప్రకృతి వింతలా అనిపిస్తోంది కదా! కానీ కాదు...!! అవును నేస్తాలూ.. ఇది మానవ నిర్మిత రాతి వంతెన. నీటిలో పడిన ప్రతిబింబం వల్ల వలయం ఆకారంలో కనిపిస్తున్న ఈ వారధి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా మరి.

విచిత్ర వంతెన 19వ శతాబ్దంలో నిర్మితమైంది. ఇది జర్మనీలో ఉంది. దీని పేరు రాకోట్జ్‌బ్రూకే వంతెన. పలకడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కదూ! దీన్ని స్థానికంగా అందరూ ‘డెవిల్‌ బ్రిడ్జి’ అని పిలుస్తారు. మనమూ అలానే అంటే సరి.

పెద్ద సంఖ్యలో...

ఈ వంతెన జర్మనీలోని సాక్సోనీలోని ఒక చిన్న పార్కులో ఉంది. ఇది ఏ ప్రధాన నగరానికీ సమీపంలో లేదు. కాబట్టి ఇక్కడికి రావడం కాస్త కష్టమే. అయినా పర్యాటకులు వ్యయప్రయాసలకోర్చి మరీ ఈ వింత వంతెనను చూడ్డానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. రాకోట్జ్‌బ్రూకే వంతెన నిర్మాణం 1860లో జరిగింది. దీని నిర్మాణం ఇప్పటికీ ఓ వింతే. కేవలం రాళ్లతో దీన్ని నిర్మించారు. ఇది చాలా సున్నితమైన నిర్మాణం. అందుకే దీని రక్షణ కోసం ఎవరినీ దీనిపైకి అనుమతించరు. అలాగే దీనికి రక్షణ గోడలు సైతం లేవు. ఈ కారణంగానే వంతెన మీదకు ఎవరూ చేరుకోకుండా, ఇరువైపులా కంచెలను ఏర్పాటు చేసి దీన్ని పరిరక్షిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో...

ఈ వంతెన ఈ మధ్య మరింత ఫేమస్‌ అయింది. కారణం సోషల్‌ మీడియా! ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుంటారు. అవి తక్కువ సమయంలోనే వైరల్‌ అవుతుండటంతో, ఈ వంతెనకు ఒక్కసారిగా క్రేజ్‌ వచ్చింది. దీన్ని వీక్షించేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది.

ప్రతిబింబం పడితే... 

డెవిల్స్‌ బ్రిడ్జి చెరువు మీద నిర్మితమైంది.  నీటిలో ఈ వంతెన ప్రతిబింబం పడినప్పుడు.. కచ్చితంగా ఓ వృత్తంలా కనిపించడం దీని ప్రత్యేకత. శీతాకాలం ముగిసిన తర్వాత వీక్షించడానికి పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అప్పుడే ఈ వంతెన మరింత అందంగా కనిపిస్తుంది! ఈ బ్రిడ్జి గురించి కొన్ని మూఢనమ్మకాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ వింత వంతెన విశేషాలు. మీకు నచ్చాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని