ఆకాశంలో నిచ్చెన... ఈ వింత వంతెన!!

చైనా ఏం చేసినా వింతే...! ఈ వంతెన కూడా ఆ జాబితాలోకే వస్తుంది. స్తంభాల్లేకుండానే పొడవైన వంతెనను అక్కడి ఇంజినీర్లు చక్కగా, చాకచక్యంగా నిర్మించారు.

Updated : 08 Dec 2023 05:50 IST

చైనా ఏం చేసినా వింతే...! ఈ వంతెన కూడా ఆ జాబితాలోకే వస్తుంది. స్తంభాల్లేకుండానే పొడవైన వంతెనను అక్కడి ఇంజినీర్లు చక్కగా, చాకచక్యంగా నిర్మించారు. దీన్ని చూసిన వారు ఔరా! అని నోరెళ్లబెడుతున్నారు. ‘కలయా.. నిజమా..!’ అని తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. మరి ఆ వంతెన విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా!

సాధారణ వంతెనలకు భిన్నంగా చైనాలోని వులాంగ్‌ ప్రాంతంలో డాడోంగ్‌ నదిపైన ఇనుప గొలుసులతో ఇటీవల ఓ బ్రిడ్జి నిర్మితమైంది. ఇది ఏకంగా 300 మీటర్ల ఎత్తులో ఉంది. నాలుగు వరుసల్లో గొలుసులు, రోప్స్‌తో దీని బేస్‌ రూపొందించారు. మధ్యలో వాహనాలు వెళ్లేందుకు వీలుగా మార్గం ఉంటుంది. ఈ వంతెన వెడల్పు దాదాపు 4.5 మీటర్లు. ఈ బ్రిడ్జి 45 టన్నుల వరకు బరువును మోయగలదు. ఇక దీని పొడవేమో దాదాపు 245 మీటర్లు.

గుండె ధైర్యం కావాలి...

ఈ బ్రిడ్జి పై నుంచి వెళ్లాలంటే వాహనదారులకు గుండె ధైర్యం కావాలి. గాలులను తట్టుకుని నిలబడేలానే వంతెనను ఇంజినీర్లు నిర్మించారు. అయినా ఏ మాత్రం పొరపాటు జరిగినా ఏకంగా 300 మీటర్ల లోతున్న లోయలో పడిపోవాల్సిందే. పై నుంచి కిందకు చూస్తే మాత్రం కళ్లు తిరగడం ఖాయం. అందుకే ఈ బ్రిడ్జి మీద వాహనాలు కాస్త నెమ్మదిగానే వెళ్తాయి. ట్రక్కులు, లారీల్లాంటి భారీ వాహనాలు ఎదురెదురుగా ప్రయాణించలేవు. ఒకటి వెళ్లిన తర్వాత మాత్రమే మరోటి వెళ్లాల్సి ఉంటుంది.

తక్కువ ఖర్చుతో..

స్తంభాలు లేకుండా కేవలం రోప్‌లు, గొలుసులతో నిర్మించిన ఈ వంతెన వల్ల చాలా ఖర్చు కలిసివచ్చిందట! ఈ మారుమూల ప్రాంతంలో వేలకోట్ల రూపాయలు వెచ్చించి సంప్రదాయక పద్ధతిలో బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం తప్పింది. అదే సమయంలో ప్రకృతికి, వృక్ష సంపదకు పెద్దగా నష్టం కలిగించాల్సిన అవసరమూ రాలేదు. ఇలా తక్కువ సమయంలోనే చైనా ఇంజినీర్లు ఈ ప్రత్యేక వంతెన నిర్మాణం పూర్తి చేశారు. ఇటీవల ఈ విచిత్ర వంతెన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, దీని గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. నేస్తాలూ.. మొత్తానికి ఈ విశేషాలన్నీ భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని