ఈ నీరు.. మరిగినది!

ఈ చలికాలంలో పొద్దున లేవాలంటే మనకు బద్ధకం! బడికి బయలుదేరాలంటే ఇంకా బద్ధకం! ఇక రాత్రైతే చలి గురించి చెప్పాల్సిన పనిలేదు.. గజగజ వణికిపోతుంటాం...!! ఈ శీతాకాలంలో నదులు, చెరువుల్లో స్నానం చేయాలంటే ఇక అంతే సంగతులు.

Published : 14 Dec 2023 00:03 IST

ఈ చలికాలంలో పొద్దున లేవాలంటే మనకు బద్ధకం! బడికి బయలుదేరాలంటే ఇంకా బద్ధకం! ఇక రాత్రైతే చలి గురించి చెప్పాల్సిన పనిలేదు.. గజగజ వణికిపోతుంటాం...!! ఈ శీతాకాలంలో నదులు, చెరువుల్లో స్నానం చేయాలంటే ఇక అంతే సంగతులు. కానీ ఓ నదిలో మాత్రం నీరు కాలాలతో సంబంధం లేకుండా నిత్యం వేడిగా ఉంటోంది. అలా అని ఆ నది నీటిలో స్నానం చేయాలనుకుంటే మాత్రం చాలా కష్టం. మరి ఆ వింత నది సంగతులేంటో తెలుసుకుందామా!

షానయ్‌- టింపిష్కా..! ‘శీతాకాలం అన్నారు. చలి అన్నారు. నది అన్నారు. వేడి నీరు అన్నారు. ఇప్పుడేంటి షానయ్‌- టింపిష్కా.. అని ఏదో నోరు తిరగని పదం అంటున్నారు!’ అని ఆలోచిస్తున్నారు కదూ! షానయ్‌- టింపిష్కా.. ఇదే ఆ నది పేరు మరి! ఇది పెరులోని హువానుకో అనే దట్టమైన అడవిలో ఉంది. ఈ నది అమెజాన్‌ నదికి ఉపనది. దీనికి లా బొంబా అనే మరో పేరు కూడా ఉంది. ఎక్కువగా ఈ పేరుతోనే అది ప్రసిద్ధి. దీనిలో నీరు వేడిగా ఉంటుంది. ప్రపంచంలో ఇదొక్కటే మరుగుతున్న నది. ఇక మరే నదికీ ఈ లక్షణం లేదు!

పొగలే పొగలు!

షానయ్‌- టింపిష్కా నది నీరు నిత్యం మరుగుతూనే ఉంటుంది. ఈ నీటి ఉష్ణోగ్రతలు ఏకంగా వంద డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటాయి. దీనికి చుట్టుపక్కల ఎక్కడా అగ్నిపర్వతాలు, వేడినీటి బుగ్గలు కానీ లేవు. అయినా ఈ నదిలో నీరు వేడిగా ఉంటుంది. నీళ్లు ఇలా నిత్యం పొగలు కక్కుతూ ఉండటానికి గల కారణం ఏంటో మాత్రం ఇప్పటికీ సరిగ్గా తెలియదు. ఎన్ని పరిశోధలు జరిగినా ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే ఉంది.

రాళ్లల్లో.. చెట్లల్లో...

ఈ మరిగే నది చుట్టూ.. 60 అడుగుల ఎత్తులో రాళ్లు, అడవి రక్షణగా ఉన్నాయి. ఈ నది అడుగున ఉన్న రాళ్లలోంచి వస్తోన్న వేడి వల్ల నీళ్లు ఇలా మరుగుతున్నట్లు ప్రాథమికంగా తేలింది. కానీ ఆ రాళ్లలోంచి వేడి ఎలా వస్తోందో మాత్రం ఇంతవరకూ ఎవరూ కచ్చితమైన కారణం చెప్పలేకపోయారు. ఎక్కడా లేని విధంగా ఈ నదీ గర్భం నుంచే వేడి ఎందుకు ఉద్భవిస్తుందో కూడా పరిశోధకులు తెలుసుకోలేకపోయారు.

ఔషధ జలాలు!

స్థానికులు ఈ నీటిలో ఔషధ గుణాలున్నట్లు విశ్వసిస్తుంటారు. ఎన్నో వ్యాధులను తగ్గిస్తాయని నమ్ముతుంటారు. ఎలాగూ షానయ్‌- టింపిష్కా నదిలో నీరు వేడిగా ఉంటుంది కాబట్టి.. అందులో ఎటువంటి బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర సూక్ష్మజీవులు మనుగడ సాగించలేవు. ఎంచక్కా ఈ నీటిని చల్చార్చుకుని తాగేయొచ్చు. నదినీళ్లలో నేరుగా చేతులు పెడితే మాత్రం కాలిపోతాయి. అక్కడక్కడా ఈ నీళ్లల్లో కప్పల్లాంటి జీవులు చనిపోయి, ఉడికిన స్థితిలో కనిపిస్తుంటాయి. అంతెందుకు ఈ నది తీరంలోని బురద కూడా చాలా వేడిగా ఉంటుంది.  

తండోపతండాలు!

షానయ్‌- టింపిష్కా నది కేవలం 6.4 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. దీని వెడల్పేమో 25 మీటర్ల వరకు ఉంటుంది. ఇక లోతేమో 6 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రకృతి వింతను చూడ్డానికి ఈ మధ్య తండోపతండాలుగా పర్యాటకులు వస్తున్నారు. వీరి వల్ల ఈ నదికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని ప్రకృతి ప్రేమికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మరిగే నది విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని