నేను చింపాంజీని కాదు వానరాన్నే!

‘చూస్తే నల్లగా చింపాంజీలా ఉంది.. కానీ కోతిలా తోక ఉందేంటి?’ కొత్తవారు ఎవరు నన్ను చూసినా.. ముందు ఇలానే అనుకుంటారు. కానీ తర్వాత విషయం తెలుసుకుని... ‘ఓ.. అవునా!’

Published : 21 Dec 2023 00:07 IST

‘చూస్తే నల్లగా చింపాంజీలా ఉంది.. కానీ కోతిలా తోక ఉందేంటి?’ కొత్తవారు ఎవరు నన్ను చూసినా.. ముందు ఇలానే అనుకుంటారు. కానీ తర్వాత విషయం తెలుసుకుని... ‘ఓ.. అవునా!’ అని అవాక్కవుతారు. నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఉవ్విళ్లూరుతారు. మీకూ నా సంగతులు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ! అందుకే నా విశేషాలు చకచకా చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు పెరువియన్‌ స్పైడర్‌ మంకీ. నేనో కోతిని. మిగతా వానరాలకు భిన్నంగా నలుపు రంగులో ఉంటాను. పెరూ, బ్రెజిల్‌, బొలీవియాల్లో నివసిస్తుంటాను. దాదాపు రెండు అడుగుల వరకు పొడవు పెరుగుతాను. మాకు దాదాపు మీటరు పొడవుండే తోకలుంటాయి. ఇవి చాలా బలంగా ఉంటాయి. చెట్ల మీద ఓ కొమ్మ నుంచి మరో కొమ్మ మీదకు దూకేటప్పుడు మాకు ఇవి బ్యాలెన్స్‌ కోసం చక్కగా ఉపయోగపడతాయి.

గుంపులు గుంపులుగా..

నేను దాదాపు ఒంటరిగా ఉండను. గుంపులోనే ఉంటాను. మా గుంపులో 20 నుంచి 30 పెరువియన్‌ స్పైడర్‌ మంకీలుంటాయి. నేను 9 కిలోల వరకు బరువు పెరుగుతాను. నా జీవిత కాలం సుమారు 20 సంవత్సరాలు. నాకు పొడవైన కాళ్లుంటాయి. వేళ్లు కూడా చాలా పొడవుగా ఉంటాయి. కానీ బొటనవేళ్లు మాత్రం ఉండవు!

ఏం తింటానంటే...

నేను ఎక్కువగా ఆకులు, పువ్వులు, బెర్రీలు, తేనె, ఇతర పండ్లను ఆహారంగా తీసుకుంటాను. కండ కలిగిన పండ్లంటే నాకు మరీ ఇష్టం. అలా అని నేను పూర్తి శాకాహారిని మాత్రం కాదు. చిన్న చిన్న కీటకాలు, పిల్ల పక్షులు, గుడ్లు, కప్పలనూ ఆహారంగా తీసుకుంటాను. కానీ వీటన్నింటికన్నా నాకు పండ్లంటేనే ఇష్టం. అవి దొరకని సమయంలో నేను చాలా పొదుపుగా ఆహారం తీసుకుంటాను. మేం మరీ అంతరించిపోయే స్థితిలో లేం కానీ... గత 45 సంవత్సరాల్లో మా సంఖ్య మాత్రం దాదాపు 50 శాతం వరకు తగ్గింది. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి.. బై... బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని