నా రంగే అందం..!

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా.. ఏంటి అంత పెద్ద ముక్కు, చక్కని రంగులో భలే ఉందే అనుకుంటున్నారు కదూ.. నాకు తెలుసు..!  నన్ను ఎన్నిసార్లు చూసినా అందరూ అలానే ఆశ్చర్యపోతారు. ఎందుకుంటే.. నా రంగు, రూపం అలాంటివి మరి. ఇంతకీ నేనెవరో, నా వివరాలేంటో చెప్పలేదు కదూ.. అయితే వెంటనే ఈ కథనం చదివేయండి అన్నీ తెలిసిపోతాయి..!

Updated : 23 Dec 2023 04:30 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా.. ఏంటి అంత పెద్ద ముక్కు, చక్కని రంగులో భలే ఉందే అనుకుంటున్నారు కదూ.. నాకు తెలుసు..!  నన్ను ఎన్నిసార్లు చూసినా అందరూ అలానే ఆశ్చర్యపోతారు. ఎందుకుంటే.. నా రంగు, రూపం అలాంటివి మరి. ఇంతకీ నేనెవరో, నా వివరాలేంటో చెప్పలేదు కదూ.. అయితే వెంటనే ఈ కథనం చదివేయండి అన్నీ తెలిసిపోతాయి..!

నా పేరు ‘రోజెట్‌ స్పూన్‌బిల్‌ బర్డ్‌’. పలకడానికి కాస్త కష్టంగా ఉంది కదా. పర్లేదులే పిలుస్తూ ఉంటే మీకే అలవాటు అవుతుంది. నా ముక్కు స్పూన్‌ ఆకారంలో ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. అమెరికా, వెనిజులా, బ్రెజిల్‌, అర్జెంటీనా వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాను. నేను గుంపులో ఉండటానికే ఎక్కువ ఆసక్తి చూపుతాను. పగటి సమయంలో ఆహారం వెతుక్కొని, రాత్రి ఎంచక్కా నిద్రపోతాను. నా దగ్గర ఓ ప్రత్యేకమైన టాలెంట్‌ కూడా ఉంది తెలుసా.. సాధారణంగా చాలా రకాల పక్షులు చెట్ల మీద, నీటి మీద కూర్చొని నిద్రపోతాయి. కానీ నేను నిల్చొని నిద్రపోగలను. ఇంకో విషయం ఏంటంటే.. నన్ను చాలా అందమైన పక్షిగా కూడా గుర్తించారు.

ఆహారమే రహస్యం..

నా శరీరం తెలుపు, రెక్కలు గులాబి రంగులో ఉంటాయి. కళ్లేమో.. ఎరుపు రంగులో ఉంటాయి. సాధారణంగా నా రంగుని చాలామంది ఇష్టపడుతుంటారు కదా! ఇంతకీ నేను ఈ రంగులో ఉండటానికి కారణమేంటో తెలుసా..? నేను తీసుకునే ఆహారమే..! క్యారెట్‌, టొమాటో, గుమ్మడికాయలు ఆహారంగా తీసుకుంటాను. అలాగని నేను శాకాహారిని అనుకోకండి నేస్తాలూ.. రొయ్యలు, పీతలతో పాటుగా చిన్నచిన్న కీటకాలను కూడా ఇష్టంగా తింటాను.

అప్పుడే మారుతుంది..

నేను సాధారణమైన ముక్కుతోనే జన్మిస్తాను. కానీ, పెరిగే క్రమంలో అది స్పూన్‌ ఆకారంలోకి మారుతుంది. పుట్టిన తర్వాత దాదాపుగా 7 వారాల్లో గూడు నుంచి బయటికి వచ్చేస్తాను. అప్పటి వరకు నా బాగోగులన్నీ మా అమ్మే చూసుకుంటుంది. నా బరువు 1.8 కిలోల వరకు ఉంటుంది. పొడవు 71 నుంచి 86 సెంటీ మీటర్ల వరకు పెరుగుతాను. మాములుగా అయితే 10 సంవత్సరాలు, చుట్టుపక్కల వాతావరణం, పరిస్థితులు అనుకూలిస్తే.. 15 ఏళ్ల వరకు జీవిస్తాను. ఇవి ఫ్రెండ్స్‌ నా విశేషాలు.. భలే ఉన్నాయి కదా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని