ప్రకృతి పరిచిన ఎర్రని తివాచీ!

చైనాలోని పంజిన్‌ నగరానికి 30 కి.మీ.దూరంలో లియోహే నది డెల్టాలో ఉంది ఈ ప్రకృతి పరిచిన ఎర్రని తివాచీ. దీన్ని ‘రెడ్‌ బీచ్‌’ అని పిలుస్తారు.

Published : 24 Dec 2023 00:19 IST

కనుచూపు మేర అంతా ఎరుపు! ఆ ప్రకృతి వింతను చూస్తే మైమరుపు.. చిత్తడి నేల మీద ఎంచక్కా పరుచుకున్న చక్కని ఎర్రని తివాచీ అది! ఏటా దోచుకుంటోంది పర్యాటకుల మది! మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!!

చైనాలోని పంజిన్‌ నగరానికి 30 కి.మీ.దూరంలో లియోహే నది డెల్టాలో ఉంది ఈ ప్రకృతి పరిచిన ఎర్రని తివాచీ. దీన్ని ‘రెడ్‌ బీచ్‌’ అని పిలుస్తారు. నిజానికి ఇది బీచ్‌ మాత్రం కాదు. చిత్తడి నేలల్లో పెరిగిన ఒకరకమైన మొక్కల సమూహం. సూర్యోదయం, సూర్యస్తమయ సమయాల్లో ఈ ప్రాంతం మరింత అందంగా ఉంటుంది. ఈ ఎర్రని మొక్కల మీద పడ్డ సూర్యకాంతి పరావర్తనం చెందడమే దానికి కారణం. అందుకే ఈ ప్రకృతి వింతను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

పచ్చగా.. ఎర్రగా..

రెల్లు జాతికి చెందిన ఈ మొక్కలు ఏప్రిల్‌, మేలో పెరుగుతాయి. అప్పుడు ఆకు పచ్చని రంగులోనే ఉంటాయి. కానీ తర్వాత నవంబర్‌, డిసెంబర్‌ వచ్చేసరికి ఎరుపురంగులోకి మారుతాయి. అందుకే అక్టోబర్‌ నుంచి ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగుతుంది.

కొంతభాగం మాత్రమే..

అయితే ఈ ప్రాంతం మొత్తాన్ని సందర్శించడానికి ప్రజలకు అనుమతి లేదు. కేవలం కొంత భాగాన్ని చూడ్డానికి మాత్రమే అనుమతిస్తారు. అది కూడా చిన్న చిన్న చెక్కవంతెనల మీద నడుస్తూ చూడాలి. ఈ అరుదైన మొక్కజాతిని కాపాడటం కోసమే ఈ ఏర్పాటన్న మాట. చలికాలం ప్రారంభం కాగానే ఈ మొక్కలు ఊదారంగులోకి మారతాయి. ప్చ్‌.. కానీ తర్వాత చనిపోతాయి.

పక్షులకు ఆవాసం!

ఈ రెల్లు గడ్డిలో దాదాపు 260 రకాల పక్షులు, 399 రకాల జంతువులు ఆశ్రయం పొందుతున్నాయని అంచనా. మరో విషయం ఏంటంటే ఈ గడ్డిని కాగితం తయారీలో కూడా వాడతారట. అందుకే ఈ ప్రాంతాన్ని చైనావాళ్లు ప్రత్యేకంగా పరిరక్షిస్తున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ‘రెడ్‌ బీచ్‌’ సంగతులు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని