మింక్‌.. అనే నేను!

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా?! నేనైతే బాగున్నా. ఇంతకీ నేనెవరని ఆలోచిస్తున్నారు కదూ! నీటి కుక్కలా కనిపిస్తున్న నా పేరు మింక్‌. నన్ను మీరెప్పుడూ చూసి ఉండరు.

Published : 25 Dec 2023 00:06 IST

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా?! నేనైతే బాగున్నా. ఇంతకీ నేనెవరని ఆలోచిస్తున్నారు కదూ! నీటి కుక్కలా కనిపిస్తున్న నా పేరు మింక్‌. నన్ను మీరెప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే నేను మీ దగ్గర నివసించను కాబట్టి. మరి నేనెక్కడ ఉంటాను. ఇంకా నా విశేషాలేంటో తెలుసుకోవాలని ఉంది కదా! అందుకే నా విశేషాలు నేనే చెప్పుకుందామని ఇదిగో ఇలా వచ్చాను. తెలుసుకుంటారా మరి.

నేను మాంసాహార జీవిని. ప్రస్తుతం నాలో రెండు రకాలున్నాయి. ఒకటి అమెరికన్‌ మింక్‌ కాగా, రెండోది యూరోపియన్‌ మింక్‌. నిజానికి మరో రకమూ ఉండేది. ప్చ్‌... కానీ ఇప్పుడది లేదు. అంతరించిపోయింది. దాన్ని సీ మింక్‌ అని పిలిచేవాళ్లు. ఇది దాదాపు అమెరికన్‌ మింక్‌లానే ఉండేది కానీ... కాస్త పెద్దగా ఉండేది. 19వ శతాబ్దం చివర్లో ఇది అంతరించిపోయింది. మీ మానవులు దాని చర్మం, ఉన్ని కోసం చేసిన వేట వల్ల.. పాపం అది పూర్తిగా అంతర్థానమైపోయింది.

చిరుజీవిని...!

నేను చిరుజీవిని. మాలో మగవి కేవలం కేజీ వరకు మాత్రమే బరువు పెరుగుతాయి. 60 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. ఆడవి 600 గ్రాముల వరకు బరువు తూగుతాయి. 50 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. తోకేమో 12 నుంచి 22 సెంటీమీటర్ల వరకు పొడవుంటుంది. నా జీవిత కాలం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే. కానీ అన్నీ అనుకూలిస్తే నేను పది సంవత్సరాల వరకు జీవించగలుగుతాను.

ఏం తింటానంటే...

నేను నీటిలో ఈదగలను, నేల మీద కూడా బతకగలను. చేపల్ని ఇష్టంగా తింటాను. ఇంకా పీతలు, నత్తలు ఇలాంటి జలచరాలను ఆహారంగా తీసుకుంటాను. నేల మీద ఉన్నప్పుడు చిన్న చిన్న జీవులు, పక్షులు, గుడ్లను ఆహారంగా తీసుకుంటాను. మాలో కొన్ని పెద్ద మింక్‌లు, చిన్న చిన్న మింక్‌లను కూడా తినేస్తాయి. మరో విషయం ఏంటంటే మాకు కుందేళ్లంటే భలే ఇష్టం. లొట్టలేసుకుని మరీ తింటాం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని