మొక్కలుగా వంగాయి.. మానులుగా ఎదిగాయి!

మొక్కై వంగనిది మానై వంగునా... అని అంటుంటారు కదూ! కానీ ఓ చోట మాత్రం మొక్కలు, చెట్లు ఓ వైపు వంగి పెరుగుతాయి. చాలా వింతగా ఉంది కదూ! ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కడ ఉందో... తెలుసుకోవాలని తెగ ఉబలాటపడుతున్నారు కదా!

Published : 14 Jan 2024 00:09 IST

మొక్కై వంగనిది మానై వంగునా... అని అంటుంటారు కదూ! కానీ ఓ చోట మాత్రం మొక్కలు, చెట్లు ఓ వైపు వంగి పెరుగుతాయి. చాలా వింతగా ఉంది కదూ! ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కడ ఉందో... తెలుసుకోవాలని తెగ ఉబలాటపడుతున్నారు కదా! అయితే ఇంకెందుకాలస్యం... చకచకా.. ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది.

న దగ్గర చెట్లు సాధారణంగా నిటారుగా పెరుగుతాయి. కొన్నిసార్లు తీవ్రమైన తుపాన్ల వల్ల పడిపోయినప్పుడు, వాటిని ఎవ్వరూ పట్టించుకోకుంటే.. కాస్త వాలుగా పెరుగుతాయి. కొన్ని రోజుల తర్వాత తిరిగి నిటారుగానే ఎదుగుతాయి. కానీ న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీపంలో స్లోప్‌ పాయింట్‌ దగ్గర మాత్రం చెట్లన్నీ నిటారుగా కాకుండా ఉత్తరం వైపు వంగి పెరుగుతాయి. కొమ్మలన్నీ ఆ దిక్కుకు వాలి ప్రకృతి గీసిన చిత్రంలా కనువిందు చేస్తాయి.

తలకట్టులా కనికట్టు...

దువ్వుకున్నప్పుడు మనలో కొందరి జుట్టు ఎలా అయితే వంపులు తిరుగుతుందో... అచ్చం అలానే ఈ చెట్లు వంకీలు తిరిగి ఉంటాయి. పక్కనే ఉండే సముద్రం నుంచి వీచే తీవ్రమైన చలిగాలులే దీనికి అసలు కారణమని పరిశోధకులు తేల్చారు. ఈ శీతల పవనాలు దక్షిణ దిశ నుంచి నిత్యం నేలను తాకుతుండటం వల్ల చెట్లు ఉత్తరం వైపు వంగి పెరుగుతున్నాయి.

గొర్రెలకు రక్షణ కోసం...

ఈ స్లోప్‌ పాయింట్‌ చాలా మారుమూల ప్రాంతం. దీన్ని చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం కూడా లేదు. కొందరు గొర్రెల కాపలాదారులు మాత్రమే జీవిస్తుంటారు. ఇక్కడున్న పచ్చిక బయళ్లలో తమ గొర్రెలను మేపుతూ జీవనాధారం పొందుతుంటారు. సముద్రం మీదుగా వచ్చే తీవ్రమైన శీతల పవనాల వల్ల వీళ్ల గొర్రెలు చాలా ఇబ్బంది పడేవి. పెద్ద సంఖ్యలో మరణిస్తుండేవి. అందుకే కొందరు గొర్రెల కాపరులు ఈ కొండవాలు ప్రాంతాల్లో కొన్ని మొక్కలు నాటి వాటిని సంరక్షించారు. ఇవి చెట్లయ్యాక గాలి వేగం తగ్గి గొర్రెలకు కాస్త ఉపశమనం దొరుకుతుందనే ఉద్దేశంతో ఇలా చేశారు. కానీ ఆ వేగమైన చలిగాలులను చెట్లు కూడా భరించలేకపోయాయి. అందుకే అవి ఉత్తరం వైపుగా వంగి పెరిగాయి.

కష్టనష్టాలకోర్చి మరీ..

రోడ్డు నుంచి దాదాపు 30 నిమిషాలు నడిస్తే కానీ ఈ మారుమూల స్లోప్‌ పాయింట్‌ దగ్గరికి సాధారణ జనాలు చేరుకోలేరు. అయినా కష్టనష్టాలకోర్చి మరీ.. సందర్శకులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఈ వింతను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుంటారు. పనిలోపనిగా సెల్ఫీలూ దిగి ఆనందపడుతుంటారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ స్లోప్‌ పాయింట్‌ సంగతులు. బాగున్నాయి కదూ! నేస్తాలూ... అన్నట్లు మీరు ఎప్పుడైనా మొక్కలు నాటి, వాటిని సంరక్షించారా...! అమ్మానాన్న సహకారం తీసుకుని ఇక నుంచైనా ప్రతినెలా ఒక మొక్క నాటండి సరేనా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని