ఏంటి అలా చూస్తున్నారు.. నేను చారల చీతాను!!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా..! ఏంటి నన్ను అలా చూస్తున్నారు. చూస్తే కాస్త చీతాలా ఉంది.. కానీ శరీరం మీద చుక్కల బదులు చారలు ఉన్నాయేంటబ్బా! ఇదేం కొత్త జీవి. దీన్ని ఇంత వరకు మేం చూడలేదే.. అని ఆలోచిస్తున్నారు కదూ! నేనేం కొత్త ప్రాణిని కాదు. నేనూ చీతానే.

Updated : 15 Jan 2024 03:37 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా..! ఏంటి నన్ను అలా చూస్తున్నారు. చూస్తే కాస్త చీతాలా ఉంది.. కానీ శరీరం మీద చుక్కల బదులు చారలు ఉన్నాయేంటబ్బా! ఇదేం కొత్త జీవి. దీన్ని ఇంత వరకు మేం చూడలేదే.. అని ఆలోచిస్తున్నారు కదూ! నేనేం కొత్త ప్రాణిని కాదు. నేనూ చీతానే. కాకపోతే మూమూలు చీతాను కాదు. మరి నా గురించి తెలుసుకోవాలని ఉంది కదూ! అందుకే నా విశేషాలు చెప్పిపోదామనే ఇలా వచ్చాను.

నా పేరు కింగ్‌ చీతా. నేను చాలా అరుదైన జాతి చీతాను. నేను కేవలం దక్షిణాఫ్రికాలో మాత్రమే జీవిస్తుంటాను. నన్ను మొట్టమొదట జింబాబ్వేలో 1926లో గుర్తించారు. మొదట పూర్తి భిన్నమైన జీవి అని భావించారు. కానీ తర్వాత సాధారణ ఆఫ్రికా చీతానే, కానీ కాస్త భిన్నంగా ఉండే రకం అని గుర్తించారు. నేను బిగ్‌క్యాట్‌ కుటుంబంలో అత్యంత అందమైన జీవిని. నా శరీరం మీద పెద్ద పెద్ద నల్లని చారలు చూడముచ్చటగా ఉంటాయి. మరో విషయం ఏంటంటే.. నేను చాలా అరుదైన జీవిని. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కింగ్‌ చీతాలు మాత్రమే ఉన్నాయి. జింబాబ్వే, దక్షిణాఫ్రికా మధ్యలోనే మేం ఉన్నాం.

అమెరికాలోనూ..

నాకు కూపర్‌ చీతా అనే పేరు కూడా ఉంది. 2014లో గ్రీన్‌విచ్‌ జూలోని ఒక ఆడ కింగ్‌ చీతా.. ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. ఇవి మొత్తం మా జనాభాలో దాదాపు పదిశాతం కావడం విశేషం. వీటిలోంచి రెండు పిల్లలను అమెరికా జూలకు పంపారు. మరో విషయం ఏంటంటే నేను కూడా మామూలు చిరుతలాగనే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలను. 50 కిలోల వరకు బరువు పెరగగలను. 1.2 నుంచి 1.5 మీటర్ల వరకు పొడవు పెరుగుతాను. మాలో మగవి ఆడకింగ్‌ చీతాలకంటే కాస్త పెద్దగా ఉంటాయి. పిల్ల కింగ్‌ చీతాలు పెరిగి పెద్దకావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది.

శత్రువులు ఎక్కువ..

మామూలు చీతాల్లాగే మాకు కూడా శత్రువుల బాధ ఎక్కువ. సింహాలు, హైనాలు, నక్కల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. మేం వేగంగా పరిగెత్తగలం కాబట్టి.. వీటి బారి నుంచి మమ్మల్ని మేం  కాపాడుకోగలం. కానీ.. మాలో చిన్నవి మాత్రం వీటికి చిక్కి, తమ ప్రాణాలు కోల్పోతాయి. అలాగే మాకు వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ. అందువల్ల మేం తేలిగ్గా జబ్బుల బారిన పడుతుంటాం.

చక్కగా వేటాడతాం...

మేం 15 నుంచి 20 సంవత్సరాల వరకు జీవిస్తుంటాం. మామూలు చిరుతలు తినే ఆహారాన్నే మేం కూడా తీసుకుంటాం. చిరుత పులులు, సింహాలకన్నా కూడా చక్కగా వేటాడగలం. కుందేళ్లు, జింకలు, దుప్పులు, అడవి పందులను ఆహారంగా తీసుకుంటాం. పదిసార్లు వేటాడితే అందులో దాదాపు ఆరుసార్లు విజయం సాధిస్తాం. నేస్తాలూ.. మాలాంటి చీతాలు కూడా ఉంటాయని, ఇప్పుడే మీకు తెలిసింది కదా! మొత్తానికి ఇవీ మా విశేషాలు. భలే ఉన్నాయి కదూ...! ఇక ఉంటామరి బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని