అరుదైన పందిని నేను!

నేస్తాలూ.. బాగున్నారా..! నేనో పందిని. అలాఅని సాదాసీదా వరాహాన్ని కాదు. అరుదైన పందిని. నాకు తెలిసి మీరు ఇంతకు ముందెప్పుడూ నన్ను చూసి ఉండరు. నా గురించి మీకు కాస్త కూడా తెలిసి ఉండకపోవచ్చు.

Updated : 18 Jan 2024 04:44 IST

నేస్తాలూ.. బాగున్నారా..! నేనో పందిని. అలాఅని సాదాసీదా వరాహాన్ని కాదు. అరుదైన పందిని. నాకు తెలిసి మీరు ఇంతకు ముందెప్పుడూ నన్ను చూసి ఉండరు. నా గురించి మీకు కాస్త కూడా తెలిసి ఉండకపోవచ్చు. అందుకే నా వివరాలన్నీ మీకు చెప్పిపోదామని... ఇదిగో ఇలా వచ్చాను!

ర్రగా.. ముద్దుగా.. బొద్దుగా.. ఉన్న నాపేరు పొటామోచోరస్‌ పోర్కస్‌. పలకడానికి కాస్త కష్టంగా ఉంది కదూ! నాకు మరో రెండు పేర్లూ ఉన్నాయోచ్‌! రెడ్‌ రివర్‌ హాగ్‌, బుష్‌పిగ్‌ అని కూడా పిలుస్తుంటారు. నేను ఆఫ్రికాకు చెందిన వరాహాన్ని. గినియా, కాంగోలియన్‌ అడవుల్లో కనిపిస్తుంటాను.  నదులు, చిత్తడి నేలలకు సమీపంలో బతుకుతుంటాను. నా కాళ్లేమో నల్లగా ఉంటాయి. వీపు మీద తెల్లటి గీత కనిపిస్తుంది. ఎర్రటి, గోధుమ రంగు వెంట్రుకలు నా శరీరమంతా ఉంటాయి. మూతి దగ్గర నలుపు, తెలుపు రంగులతో డిజైన్‌ ఉంటుంది. ఇదే నాకు ప్రత్యేక అందాన్ని తీసుకు వస్తుంది.

గుంపులు.. గుంపులుగా..!

మేం దాదాపు 45 నుంచి 115 కిలోల వరకు బరువు తూగుతాం. మాకు సన్నని తోక ఉంటుంది. అది దాదాపు 45 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. మా చెవులు చిన్న చాటల్లా పొడవుగా పెరుగుతాయి. అన్నట్లు మాకు పదునైన దంతాలు కూడా ఉంటాయి. మేం పగటిపూట చురుగ్గా ఉంటాం. రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటాం. గుంపులు గుంపులుగా జీవిస్తుంటాం. ఒక్కో బృందంలో ఆరు నుంచి పది జీవులుంటాయి. కొన్ని పెద్ద గుంపుల్లో 30 వరకు కూడా ఉంటాయి. చిరుత పులులు, జాగ్వార్‌లు మాకు ప్రధాన శత్రువులు.

అన్నీ తింటాం...

వేర్లు, గడ్డలు, దుంపలు, గింజలు, కాయలు, పండ్లు, గడ్డి, నీటి మొక్కలు, పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటాం. అలా అని మేం శాకాహారులం కాదు. గుడ్లు, కీటకాలు, నత్తలు, బల్లులు, సరీసృపాలు, పందిపిల్లలు, జింకలు, మేకలు, గొర్రెలనూ తింటాం. మా పిల్లలు పుట్టినప్పుడు 650 నుంచి 900 గ్రాముల వరకు బరువు తూగుతాయి. ఒంటి మీద పసుపు చారలు, మచ్చలతో ముదురు గోధుమ రంగులో ఉంటాయి. తర్వాత క్రమంగా మారతాయి. రెండేళ్ల తర్వాత పూర్తిగా మాలా కనిపిస్తాయి. మా జీవితకాలం దాదాపు పదిహేను సంవత్సరాలు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి.. నాకు తెగ ఆకలేస్తోంది. బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని