ఆ మొదటి స్థానం నాదే..!

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! ఏంటి బాగున్నా అంటుంది.. చూడటానికి మాత్రం వికృతంగా ఉంది అనుకుంటున్నారా..? ఏం చేస్తాం.. నా రూపమే అంత. ఇంతకీ నా పేరేంటో, వివరాలేంటో మీకు తెలియదు కదా. అది చెప్పి వెళ్దామనే ఇలా వచ్చాను. వెంటనే ఈ కథనం చదివేయండి.. మీకే తెలుస్తుంది..! 

Updated : 20 Jan 2024 03:27 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! ఏంటి బాగున్నా అంటుంది.. చూడటానికి మాత్రం వికృతంగా ఉంది అనుకుంటున్నారా..? ఏం చేస్తాం.. నా రూపమే అంత. ఇంతకీ నా పేరేంటో, వివరాలేంటో మీకు తెలియదు కదా. అది చెప్పి వెళ్దామనే ఇలా వచ్చాను. వెంటనే ఈ కథనం చదివేయండి.. మీకే తెలుస్తుంది..! 

నా పేరు మార్‌బౌ స్ట్రోక్‌. నేను దక్షిణాఫ్రికాలో పుట్టాను. జింబాబ్వే, కెన్యా వంటి దేశాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తాను. నన్ను ఇంకా ‘అండర్‌ టేకర్‌ బర్డ్‌’ అని కూడా పిలుస్తారు తెలుసా! నేను పేరుకు పక్షినే అయినా.. ఆకాశంలో ఎగిరేది చాలా తక్కువ. నేల మీదే తిరుగుతుంటాను. నాకు చనిపోయిన జంతువులను తినడం చాలా ఇష్టం. అప్పుడప్పుడే వేటాడతాను. పాములు, మొసలి పిల్లలను ఇష్టంగా ఆరగిస్తాను. నీరు ప్రవహించే ప్రాంతంలో ఉండటం నాకు నచ్చుతుంది.

అందంగా ఉండను..!

నేను చూడటానికి నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాను. సాధారణంగా పక్షులంటే భలే అందంగా ఉన్నాయే అనుకుంటారు అందరూ. కానీ నన్ను చూస్తే మాత్రం ఎవరూ అలా అనుకోరు. ఎందుకంటే నేను భయంకరంగా ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే.. ప్రపంచంలో అందవిహీనమైన పక్షుల్లో నాదే మొదటి స్థానం. నా జుట్టు, పొడవాటి ముక్కు, దాని మీద మచ్చలు చూడగానే.. ‘ఏంటి ఇది ఇలా ఉంది’ అనుకుంటారు. దానికి తోడు నా గొంతు దగ్గర తొండం లాంటి ఆకారం ఒకటి ఉంటుంది. చూడటానికి ప్రత్యేకంగా కనిపించినా.. దీని వల్ల నాకు నష్టమే తప్ప లాభం లేదు. నక్కలు మమ్మల్ని ఎక్కువగా వేటాడటానికి ప్రయత్నిస్తాయి. ఆ సమయంలో తొండం వల్ల పరిగెత్తలేక వాటికి ఆహారం అయిపోతాం.

రాబందులా కనిపిస్తా..!

దూరం నుంచి చూస్తే నేను కాస్త రాబందులా కనిపిస్తాను. కానీ నా ముక్కు చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు 35 సెంటీ మీటర్లు ఉంటుంది. నా బరువు 4 నుంచి 9 కిలోల వరకు పెరుగుతుంది. ఎత్తు 120 నుంచి 130 సెంటీ మీటర్లు ఉంటాను. సాధారణంగా అయితే 25 ఏళ్లు, రక్షణ కల్పిస్తే.. 41 సంవత్సరాల వరకు జీవిస్తాను. కానీ నేను అందంగా ఉండను కాబట్టి నన్ను ఎవరూ పట్టించుకోరు. ఇవి ఫ్రెండ్స్‌ నా విశేషాలు మీకు నచ్చాయి కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని