అహో.. అందాల గిరివిల్లు!

ఆకాశంలో హరివిల్లు భలే కనువిందు చేస్తుంది! పిల్లలమైన మనకు ఇంద్రధనస్సు అంటే భలే ఇష్టం కదూ! కానీ కొండలు రంగులతో కనిపిస్తే ‘గిరి’విల్లులా భలేగా ఉంటుంది కదా.

Updated : 28 Jan 2024 04:43 IST

ఆకాశంలో హరివిల్లు భలే కనువిందు చేస్తుంది! పిల్లలమైన మనకు ఇంద్రధనస్సు అంటే భలే ఇష్టం కదూ! కానీ కొండలు రంగులతో కనిపిస్తే ‘గిరి’విల్లులా భలేగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం అలాంటి గుట్టల గురించే తెలుసుకోబోతున్నాం. ఈ కథనం చదివేయండి.. ఆ వివరాలేంటో మీకూ తెలుస్తాయి.

కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏర్పడిన ఈ రంగుల గిరులు అమెరికాలో ఉన్నాయి. ఈ ప్రాంతం పురాతన నది పరివాహక ప్రాంతానికి చెందింది. వీటిని పెయింటెడ్‌ హిల్స్‌ అని పిలుస్తారు. ఇవి వీలర్‌కౌంటీ, ఓరగాన్‌లో ఉన్నాయి. ఈ రంగుల కొండలు దాదాపు 3,132 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఓరగాన్‌లోని మిచెల్‌కు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో కొలువుతీరి ఉన్నాయి.

ప్రకృతి వింత...

ఓరగాన్‌ ఏడు వింతల్లో ఈ పెయింటెడ్‌ హిల్స్‌ కూడా స్థానం పొందాయి. కొండలకున్న పలు రంగురంగుల లేయర్స్‌ వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. పురాతన నదికి వరదలు వచ్చినప్పుడు కొండలకు ఈ రంగులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 35 మిలియన్‌ సంవత్సరాల క్రితం పర్యావరణంలోని మార్పుల కారణంగా ఈ రంగు పొరలు ఏర్పడ్డాయి.

ఎరుపు. పసుపు.. మైమరుపు..!

ఈ కొండలు ఎరుపు, పసుపు పొరలతో నిండి ఉన్నాయి. వీటిని చూడగానే సందర్శకులు ఒక రకమైన తన్మయత్వానికి లోనవుతారు. ఈ ప్రకృతి వింతకు పరవశించిపోతుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ పెయింటెడ్‌ హిల్స్‌ను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ నేలలో లాటరైట్లు, ఇనుము, అల్యూమినియం ఎక్కువగా ఉంటాయి. అవి వాతావరణంతో జరిపే చర్యల వల్లే ఈ రంగులు ఏర్పడుతున్నాయి. నేస్తాలూ.. మొత్తానికి ఈ ప్రకృతి వింత భలేగా ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని