నేను మేఁ.. మేఁ.. మేకను కాదోచ్‌!

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా..! చూడ్డానికి నేను కాస్త మేకలా కనిపిస్తున్నాను కదూ! కానీ కాదు. జింకను కూడా కాదు. మరి నా పేరేంటి.. నా తీరేంటో.. తెలుసుకోవాలని ఉంది కదూ! అందుకే మీకు నా వివరాలు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను.

Published : 29 Jan 2024 00:17 IST

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా..! చూడ్డానికి నేను కాస్త మేకలా కనిపిస్తున్నాను కదూ! కానీ కాదు. జింకను కూడా కాదు. మరి నా పేరేంటి.. నా తీరేంటో.. తెలుసుకోవాలని ఉంది కదూ! అందుకే మీకు నా వివరాలు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు సావోలా. నాకు స్పిండిల్‌ హార్న్‌ అనే మరో పేరు కూడా ఉంది. నేను వియత్నాంలో జీవిస్తుంటాను. ప్రపంచంలోకెల్లా అత్యంత అరుదైన జీవిని నేను. నా మొట్టమొదటి ఫొటో 1993లో తీశారు. కేవలం ్టదీనికి సంవత్సరం ముందు మాత్రమే నా ఉనికి శాస్త్రజ్ఞులకు తెలిసింది. అసలు నాలాంటి పెద్ద జీవిని ఇంత ఆలస్యంగా కనుగొనడం నిజంగా ఆశ్చర్యమే కదూ!

అది 1992వ సంవత్సరం..

1992వ సంవత్సరం, మే నెలలో వు క్వాంగ్‌ నేషనల్‌ పార్క్‌లో జీవవైవిధ్యాన్ని పరిశీలించడానికి వియత్నాం అటవీ మంత్రిత్వశాఖ ఓ సర్వే బృందాన్ని పంపింది. వీరు మే 21 న స్థానిక వేటగాడి నుంచి ఒక జత విచిత్రమైన, పొడవైన కొమ్ములున్న పుర్రెను సేకరించారు. దీని మీద పరిశోధనలు చేసిన తర్వాత 17 జులై 1992న నాకు సావోలా, వు క్వాంగ్‌ ఎద్దు అని పేరు పెట్టారు. మరో విచిత్రం ఏంటంటే మేం ఇప్పటికీ చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాం.

ఏం తింటామంటే..

మా బరువు సుమారు 80 నుంచి 100 కిలోల వరకు ఉంటుంది. మేం గోధుమ రంగులో ఉంటాం. మాలో ఆడ, మగ జీవులు దాదాపు ఒకేలా ఉంటాయి. మేం శాకాహారులం, ఆకులు, ఫలాలను ఆహారంగా తీసుకుంటాం. మాలో ఆడ జీవులు ఓసారి ఒక దూడకు మాత్రమే జన్మనిస్తాయి.

ఉచ్చుల్లో పడి..

మాకు చాలా సిగ్గు. అందుకే మేం ఎక్కువగా మీ మనుషుల కంట్లో పడం. కానీ.. అడవిపందుల్లాంటి జీవుల నుంచి తమ పంటలను రక్షించుకోవడానికి రైతులు వేసే ఉచ్చుల్లో అప్పుడప్పుడు మేమూ చిక్కుకుంటూ ఉంటాం. పరిరక్షణ బృందాల వారు ఇప్పటి వరకు దాదాపు 26,651 సావోలను ఇలా ఉచ్చుల బారి నుంచి కాపాడరట.

వేట వల్ల..

మా సంఖ్య తక్కువగా ఉండటానికి, మా జనాభా పెరగకపోవడానికి కారణం వేట. స్థానిక తెగల వారు మమ్మల్ని మా చర్మం, మాంసం కోసం తీవ్రంగా వేటాడుతుంటారు. అలాగే శాస్త్రవేత్తలు మా ఉనికి కోసం తీవ్రంగా గాలిస్తూ ఉంటారు. ఇది కూడా మాపై వేటగాళ్లకు మరింత ఆసక్తిని రేకెత్తించింది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. బాగున్నాయి కదూ.. ఇక ఉంటా మరి బై.. బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని