చెట్టుకు కాసిన కుర్చీలివి!

కుర్చీలేంటి.. చెట్టుకు కాయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ ఫ్రెండ్స్‌! కానీ ఇది నిజంగా నిజం! మామూలుగా అయితే చెట్ల నుంచి వచ్చిన కలపతో కుర్చీలు, బెంచీలు తయారు చేస్తారు. కానీ ఓ అంకుల్‌ మాత్రం ఏకంగా చెట్లకే కుర్చీలు పెరిగేలా చేస్తున్నాడు. ఆ వివరాలేంటో.. తెలుసుకుందామా!

Updated : 05 Feb 2024 04:49 IST

కుర్చీలేంటి.. చెట్టుకు కాయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ ఫ్రెండ్స్‌! కానీ ఇది నిజంగా నిజం! మామూలుగా అయితే చెట్ల నుంచి వచ్చిన కలపతో కుర్చీలు, బెంచీలు తయారు చేస్తారు. కానీ ఓ అంకుల్‌ మాత్రం ఏకంగా చెట్లకే కుర్చీలు పెరిగేలా చేస్తున్నాడు. ఆ వివరాలేంటో.. తెలుసుకుందామా!

ఇంగ్లాండ్‌కు చెందిన గవిన్‌ మన్రో అనే అంకుల్‌ జెన్‌ త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ స్ఫూర్తితో ఇలా చెట్లకే కుర్చీలు కాసేలా చేస్తున్నారు. ఫర్నిచర్‌ తయారీ కోసం చెట్లను నరికివేయడం ఈ అంకుల్‌కు నచ్చలేదు. అందుకే చెట్టుకే నేరుగా కుర్చీ కాసేలా చేస్తే.. అప్పుడు దాని వరకే నరుక్కొని వాడుకోవచ్చు, చెట్టు కూడా ప్రాణాలతోనే ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టాడు.

పదేళ్లుగా.. పదిలంగా..!

గవిన్‌ అంకుల్‌, అతని బృందం ఇలా పదేళ్లుగా ఈ పనిచేస్తూ, పర్యావరణానికి తమ వంతుగా మేలు చేస్తున్నారు. నాలుగెకరాల స్థలంలో దాదాపు 3,000 మొక్కలను నాటారు. వాటి నుంచే ఈ కుర్చీలను పుట్టిస్తున్నారు. చిన్నప్పుడు తన తోటలో కుర్చీ ఆకారంలో ఉన్న బోన్సాయ్‌ మొక్కను చూసినప్పుడు మొట్టమొదట గవిన్‌కు ఈ వెరైటీ ఆలోచన వచ్చింది. అంతేకాకుండా ఈ అంకుల్‌ వంగిన వెన్నుపూసతో పుట్టాడు. దీంతో చాలాకాలం ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అక్కడ వైద్యులు వెన్నును సరిచేసేందుకు మెటల్‌ ఫ్రేంను అమర్చారు. కొన్ని సంవత్సరాల పాటు గవిన్‌ దాంతో సహవాసం చేయాల్సి వచ్చింది. ఈ అనుభవం కూడా తనకు ఈ ప్రాజెక్టులో సాయపడింది. లేతగా ఉన్నప్పుడే మొక్కను ఎలా కావాలంటే అలా వంచొచ్చని తెలిసింది.

మేకులు లేకుండానే మేకింగ్‌!

గవిన్‌ ఈ వెరైటీ కుర్చీల తయారీకి ఎలాంటి మేకులనూ ఉపయోగించరు. అంతా ప్రకృతి సిద్ధంగానే జరుగుతుంది. ఈ సహజసిద్ధ కుర్చీల కోసం ఈ అంకుల్‌ విల్లో మొక్కలు, కొన్ని ఇతర తీగజాతి మొక్కలను ఎంచుకున్నారు. ఇవి పెరిగే క్రమంలో వీటి నుంచి కుర్చీల ఆకృతి రావడం కోసం మెటల్‌ ఫ్రేమ్‌లను ఉపయోగించారు.

ఎదురు చూడాల్సిందే...!

ఈ పద్ధతిలో ఇలా అనుకోగానే అలా కుర్చీలు తయారు కావు. దాదాపు ఏడు నుంచి పదేళ్లు పడుతుంది. అంత వరకు ఓపికగా ఎదురు చూడాల్సిందే. కుర్చీ ఆకృతిలో చెట్టు పెరగడానికి ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాలు పడితే, ఎండడానికి మరో ఎడాది పడుతుంది! అందుకే ఈ కుర్చీల ధరలు కూడా ఏకంగా రూ.లక్షల్లోనే ఉంటాయి. వీటిని అమ్మడం కోడం ‘ఫుల్‌ గ్రోన్‌’ పేరుతో గవిన్‌ ఓ కంపెనీని కూడా స్థాపించారు. రానున్న రోజుల్లో ఏడాదికో కుర్చీ తయారయ్యే దిశగా ఈ అంకుల్‌ ప్రయోగాలూ చేస్తున్నారు. ఈ పరిశోధనలు విజయవంతం కావాలని, ఇలాంటి పర్యావరణ హిత ఫర్నిచర్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావాలని మనమూ కోరుకుందామా ఫ్రెండ్స్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు