పండు.. పండు.. బుజ్జి పండు.. ఉవేరియా గ్రాండిఫ్లోరా దాని పేరు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఈ చిత్రాలను చూసి, ఇవి అరటిపండ్లు అనుకుంటే... మీరు తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే ఇవి అరటి పండ్లు కాదు. వీటిని ఉవేరియా గ్రాండిఫ్లోరా అని పిలుస్తారు. ఇంతకీ ఇవేంటి? ఏఏ ప్రదేశాల్లో, ఏ దేశాల్లో కాస్తాయో తెలుసా!

Updated : 07 Feb 2024 05:13 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఈ చిత్రాలను చూసి, ఇవి అరటిపండ్లు అనుకుంటే... మీరు తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే ఇవి అరటి పండ్లు కాదు. వీటిని ఉవేరియా గ్రాండిఫ్లోరా అని పిలుస్తారు. ఇంతకీ ఇవేంటి? ఏఏ ప్రదేశాల్లో, ఏ దేశాల్లో కాస్తాయో తెలుసా!

చూడ్డానికి కాస్త బుజ్జి అరటిపండ్లలా ఉన్న ఈ ఫలాల పేరు ఉవేరియా గ్రాండిఫ్లోరా. ఇవి ఫిలిప్పీన్స్‌, చైనా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్‌, వియత్నాం, న్యూగినియా, సుమిత్రా, మయన్మార్‌లో కనిపిస్తుంటాయి. ఆయా దేశాల్లో మళ్లీ ఈ ఫలాలకు వేరు వేరు పేర్లుంటాయి. ఫిలిప్పీన్స్‌ను వీటికి పుట్టినిల్లుగా చెబుతుంటారు.

బుజ్జి బుజ్జి ఫలాలు!

ఈ చెట్లలో చాలా రకాల జాతులున్నాయి. వీటి ఫలాలు కొంచెం బుజ్జి అరటిపండ్లలా అనిపిస్తాయి. కానీ... నిజానికి ఉవేరియా అంటే లాటిన్‌లో ‘ద్రాక్ష’ అని అర్థం. ఉవేరియా గ్రాండిఫ్లోరా చెట్లు పది మీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి. పండ్లు సాధారణంగా సుమారు 4 నుంచి 5.5 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. విత్తనాలు బూడిద రంగులో ఉంటాయి. పండులో ఇవి రెండు వరసల్లో కనిపిస్తుంటాయి.

ఎన్నో ఔషధ లక్షణాలు...

ఈ చెట్టు బెరడు, పత్రాలు, వేర్లలో ఎన్నో ఔషధ లక్షణాలున్నాయని పరిశోధనలు తేల్చాయి. ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ క్యాన్సర్‌ కారకాలున్నాయని తేల్చారు. మలేషియాలో అయితే ఈ చెట్టు వేర్లు, పత్రాలను కడుపు నొప్పి నివారణ, చర్మ వ్యాధుల చికిత్సలో వాడతారట. పండ్లు కూడా రుచిగా ఉంటాయట. మొత్తానికి ఈ విశేషాలన్నీ భలేగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్‌..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని