కిరీటమున్న పక్షిని నేను..!

నా పేరు యురేషియన్‌ హూపో. హుద్‌హుద్‌ అని కూడా పిలుస్తారు. అప్పట్లో ఓ తుపానుకు కూడా నా పేరే పెట్టారు తెలుసా! నేను ఎక్కువగా చైనా, కొరియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ వంటి దేశాల్లో కనిపిస్తాను.

Updated : 08 Feb 2024 01:23 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా..! ఏంటి నేను ఇంత మాట్లాడుతుంటే.. మీరు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. దీని రంగు, రూపం భలే ఉన్నాయే అనుకుంటున్నారు కదూ..! నాకు తెలిసి.. మీరు నన్నెప్పుడూ చూసి ఉండరు. అందుకే ఒకసారి పరిచయం చేసుకుందామని ఇలా వచ్చాను.. వెంటనే ఈ కథనం చదివేయండి మరి! 

నా పేరు యురేషియన్‌ హూపో. హుద్‌హుద్‌ అని కూడా పిలుస్తారు. అప్పట్లో ఓ తుపానుకు కూడా నా పేరే పెట్టారు తెలుసా! నేను ఎక్కువగా చైనా, కొరియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ వంటి దేశాల్లో కనిపిస్తాను. నా రెక్కల మీద నలుపు, తెలుపు రంగులో జీబ్రా లాంటి గీతలు ఉంటాయి. శరీరమేమో.. లేత నారింజ రంగులో చాలా బాగుంటుంది. ఇక తల మీద ఉండే.. కిరీటం ఆకారమే నేను ఇంకా అందంగా కనబడేలా చేస్తుంది. నన్ను కన్నడలో చంద్రముకుత్‌ అని పిలుస్తారు. అంటే కిరీటం వంటి ఆకారం కలిగిన పక్షి అని అర్థం అన్నమాట. నేను చెట్లు, గడ్డి, నీరు ఉన్న చోట జీవించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతాను. గాల్లో ఎగరడం కంటే.. నేల మీద తిరగడమే నాకు ఎక్కువ ఇష్టం. మీకో విషయం తెలుసా.. నేను ఇజ్రాయెల్‌ దేశానికి జాతీయ పక్షిని కూడా..!

అప్పుడే గూడు..!

నేను చిన్న చిన్న కీటకాలను, కప్పలను ఆహారంగా తీసుకుంటాను. ఎంత చిన్న కీటకాన్ని అయినా.. నా ముక్కుతో ఇట్టే పట్టుకోగలను తెలుసా..!  స్ట్రాబెర్రీ వంటి పండ్లు కూడా ఇష్టంగా తింటాను. పగటి సమయం ఆహారం వెతుక్కొని.. రాత్రి ఎంచక్కా నిద్రపోతాను. ఫిబ్రవరి నుంచి మే మధ్యలో నేను గూడు నిర్మించుకుంటాను. మేము పుట్టిన తర్వాత కొన్ని వారాల వరకు మా తల్లులే ఆహారాన్ని తీసుకొచ్చి పెడతాయి. మాలో మేము మాట్లాడుకుంటాం కూడా.. కానీ మా మాటలు మీకు అస్సలు అర్థం కావు. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం మా సంఖ్య తగ్గిపోతుంది.
కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు మాకు రక్షణ కల్పిస్తున్నాయి. నా బరువు 46 నుంచి 89 గ్రాముల వరకు ఉంటుంది. పొడవు 25 నుంచి 32 సెంటీ మీటర్లు. దాదాపు పదేళ్ల వరకు జీవిస్తాను. ఇవి నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని