ఆవులా ఆకుల్ని తింటానోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా..! నేనో పక్షిని. అలా అని మూమూలు విహంగాన్ని కాదు. నాకో ప్రత్యేకత ఉంది. నేను ఇతర పక్షుల్లా కాకుండా.. ఆవులా ఆకుల్ని తిని బతికేస్తాను! నా ఈ ఆహారపుటలవాటు భలే వింతగా ఉంది కదూ! మరి నా గురించి మీకు, మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉంది కదా! అందుకే ఆ వివరాలు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

Updated : 14 Feb 2024 04:17 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా..! నేనో పక్షిని. అలా అని మూమూలు విహంగాన్ని కాదు. నాకో ప్రత్యేకత ఉంది. నేను ఇతర పక్షుల్లా కాకుండా.. ఆవులా ఆకుల్ని తిని బతికేస్తాను! నా ఈ ఆహారపుటలవాటు భలే వింతగా ఉంది కదూ! మరి నా గురించి మీకు, మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉంది కదా! అందుకే ఆ వివరాలు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు హోట్‌జిన్‌. నేను దక్షిణ అమెరికాకు చెందిన పక్షిని. నేను అమెజాన్‌, ఒరినోకో నదీ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తుంటాను. ఎంచక్కా ఎగరగలను.. కానీ ఎక్కువ దూరం మాత్రం కాదు. తక్కువ దూరాల వరకే రెక్కలకు పని చెప్పగలను. నేను ఇతర పక్షుల్లా కాకుండా అచ్చం ఆవులా ఆకులు, చిగుళ్లను ఆహారంగా తీసుకుంటాను. ఎక్కువ సమయాన్ని కొమ్మపై కూర్చుని గడపడానికే కేటాయిస్తాను. ఈ సమయంలో నేను తీసుకున్న ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతూ ఉంటుంది.

గట్టిగా అరుస్తాం..

నేను సుమారు 65 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. బరువేమో ఒక కేజీ వరకు తూగుతాను. నా తోక పొడవుగా ఉంటుంది. గోధుమ, పసుపు రంగులో ఈకలు ఉంటాయి. నా కళ్లేమో ఎరుపు రంగులో కనువిందు చేస్తాయి. కోతులు మాకు ప్రధాన శత్రువులు. అవి మా మీద దాడి చేసినప్పుడు గట్టిగా అరుస్తాం. ఈ అరుపులు ఇతర హోట్‌జిన్లకు హెచ్చరికల్లా పనిచేస్తాయి.

ఎంచక్కా. ఈదేస్తాం..!!

మీకు మరో విషయం తెలుసా.. మేం చక్కగా ఈదగలం. మేం మా గూళ్లను నీటిపైనే ఏర్పాటు చేసుకుంటాం. శత్రువుల నుంచి మా సంతానాన్ని రక్షించుకోవడానికే ఇలా చేస్తుంటాం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఫ్రాన్స్‌లో దొరికిన శిలాజాల ఆధారంగా మేం చాలా పురాతన జీవులం అని, దాదాపు 36 మిలియన్‌ సంవత్సరాల పూర్వం నుంచే ఈ భూమి మీద జీవించి ఉంటున్నామని తేలింది.

పూలు, పండ్లు కూడా.. కానీ!!

మేం తీసుకునే ఆహారంలో 82 శాతం ఆకులు, పది శాతం పూలు, 8 శాతం మాత్రమే పండ్లు ఉంటాయి. సాధారణంగా కీటకాలను తినం. మేం ఆకుల్ని ఆహారంగా తీసుకునే ముందు చిన్న చిన్న ముక్కలుగా మా ముక్కు సాయంతో కత్తిరించుకుంటాం. తర్వాత వాటిని నెమ్మదిగా మింగేస్తాం. మాకున్న ప్రత్యేక జీర్ణవ్యవస్థ వల్ల అవి జీర్ణమవుతాయి. అన్నట్లు మీకు చెప్పడం మరిచిపోయాను. నన్ను స్థానికులు స్టింక్‌ బర్డ్‌ అని కూడా పిలుస్తుంటారు. విపరీతమైన వేట, అడవుల నరికివేత, పర్యావరణ మార్పుల వల్ల మా సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు.
ఇక ఉంటామరి... బై.. బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు