నేను మాట్లాడగలను తెలుసా..!

హాయ్‌ నేస్తాలూ..! ఏంటి అలా నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఓ అర్థమైంది.. నా రంగు మీకు బాగా నచ్చింది కదూ! ఇంతకీ ఎలా ఉన్నారు. నేనైతే చాలా బాగున్నా.. నేనెవరో మీకు తెలియదు కదా.

Updated : 17 Feb 2024 05:26 IST

హాయ్‌ నేస్తాలూ..! ఏంటి అలా నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఓ అర్థమైంది.. నా రంగు మీకు బాగా నచ్చింది కదూ! ఇంతకీ ఎలా ఉన్నారు. నేనైతే చాలా బాగున్నా.. నేనెవరో మీకు తెలియదు కదా. అందుకే ఒకసారి పరిచయం చేసుకుందామని ఇలా వచ్చాను. ఆలస్యం చేయకుండా ఈ కథనం చదివేయండి నా వివరాలేంటో తెలుస్తాయి!

నా పేరు బ్లూ జాయ్‌. నేను ఉత్తర అమెరికాకు చెందిన పక్షిని. మెక్సికో, కెనడా వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను. నన్ను జాయ్‌ బర్డ్‌ అని కూడా పిలుస్తారు. మొదటిసారి నన్ను చూసిన వాళ్లు అయితే.. అలాగే చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే నా రంగు, రూపం అలాంటిదన్నమాట. నా శరీరం తెలుపు, లేత నీలం రంగుల్లో చాలా అందంగా ఉంటుంది. రెక్కల మీద ముదురు నీలంతో పాటు నలుపు రంగు గీతలు ఉంటాయి. ఇక మెడ కింది భాగం, కాళ్లు, ముక్కు నలుపు రంగులో ఉంటాయి.

 తెలివైన దాన్ని..!

 మీకు చెప్పలేదు కదా నేస్తాలూ.. నేను చాలా తెలివైన పక్షిని. మీ దగ్గర రామచిలుకల్లా నేను కూడా శిక్షణ ఇస్తే మాట్లాడగలను. ఇంకో విషయం ఏంటంటే.. నేను గద్ద, రాబందుల్లా ప్రవర్తించగలను. అలాగే ఇతర పక్షుల గొంతును మిమిక్రీ కూడా చేయగలను తెలుసా! మేము విత్తనాలు, పండ్లు, చిన్నచిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాం. గూడు కట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపం. ఇతర పక్షుల గూళ్లను ఆక్రమిస్తాం. పుట్టిన తర్వాత రెండు నెలల వరకు మా అమ్మ దగ్గరే ఉంటాము. అప్పటిదాకా.. అమ్మే మాకు సంబంధించిన అన్ని విషయాలూ చూసుకుంటుంది. మా గుంపుని ‘బ్యాండ్‌’ అని పిలుస్తారు తెలుసా!

కథలో పక్షిని..!

నేను గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎగరగలను. బరువు 70 నుంచి 100 గ్రాముల వరకు తూగుతాను. పొడవు 22 నుంచి 30 సెంటీ మీటర్లు ఉంటాను. సాధారణంగా అయితే 7 సంవత్సరాలు, నాకు రక్షణ కల్పిస్తే 26 ఏళ్ల వరకు జీవిస్తాను. కానీ నాకు పంజరంలో ఉండటం అస్సలు నచ్చదు. అప్పట్లో కథలు రాసేటప్పుడు కథా వస్తువులుగా రచయితలు ఎక్కువగా నన్నే తీసుకునేవారు. ఇవి నా విశేషాలు. మీకు నచ్చాయి కదూ.. ఉంటా మరి బై.. నేస్తాలూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని