ఇవి అలలు చెక్కిన శిలలు!

నేస్తాలూ... మనందరికీ సముద్రం అన్నా.. అలలన్నా భలే ఇష్టం కదూ! ఈ సముద్రపు అలలకు విపరీతమైన శక్తి ఉంటుంది. అప్పుడప్పుడు ఇవి కొన్ని ప్రకృతి వింతలను కూడా సృష్టిస్తాయి.

Published : 18 Feb 2024 00:28 IST

నేస్తాలూ... మనందరికీ సముద్రం అన్నా.. అలలన్నా భలే ఇష్టం కదూ! ఈ సముద్రపు అలలకు విపరీతమైన శక్తి ఉంటుంది. అప్పుడప్పుడు ఇవి కొన్ని ప్రకృతి వింతలను కూడా సృష్టిస్తాయి. ఇప్పుడు మనం అలాంటి ఓ అద్భుతం గురించి తెలుసుకుందాం.. సరేనా!

ఒకదానిపై మరోటి పేర్చినట్లుగా ఉన్న ఈ రాళ్లను పాన్‌కేక్‌ రాక్స్‌ అని పిలుస్తారు. ఇవి న్యూజిలాండ్‌లో ఉన్నాయి. పాపరోవా నేషనల్‌ పార్క్‌కు సమీపంలోని పునకైకి గ్రామానికి ఆనుకుని కనువిందు చేస్తుంటాయి. వీటిని చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు.

 కోట్ల సంవత్సరాలకు పూర్వం..

 ఈ పాన్‌కేక్‌ రాక్స్‌ కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఏర్పడ్డాయి. ఈ సముద్రంలోని జీవులు చనిపోయిప్పుడు వాటి పెంకులు, సమీపంలోని ద్వీపాల నుంచి ఇసుక, మట్టి కలిసి అడుగుకు చేరాయి. ఈ ప్రక్రియ కొన్ని కోట్ల సంవత్సరాలపాటు జరిగింది. చివరికి మందపాటి కాల్షియం కార్బోనేట్‌ నిక్షేపంలా ఏర్పడింది. ఇదంతా సముద్రమట్టం కన్నా కొన్ని అడుగులపైకి చేరుకుంది. ఈ సున్నపురాయి కాలక్రమేణా సముద్ర కోతకు గురై ఇప్పుడున్న ఆకృతులు వచ్చాయి.

అబ్బురపరిచే బ్లో హోల్స్‌..

సున్నపురాయి ఇలా కోతలకు గురైనప్పుడు కొన్ని చోట్ల బ్లో హోల్స్‌ ఏర్పడ్డాయి. అంటే సముద్రం అలలు ఈ రాయికి కింద నుంచి రంధ్రాలు చేశాయి. అవి ఒక రకమైన గుహల్లా తయారయ్యాయి. సముద్రం అలలు ఈ గుహల గుండా ప్రయాణించినప్పుడు నీరు పైకి ఎగజిమ్ముతుంది. నీరు వెళ్లిపోగానే.. మళ్లీ గాలితో నిండుతుంది. తిరిగి నీరు రాగానే గాలి ఒత్తిడితో కొన్ని అడుగుల ఎత్తు వరకు ఎగజిమ్ముతుంది. ఇలా ఈ ప్రకృతి వింతను చూడ్డానికి రెండు కళ్లూ చాలవంటే నమ్మండి. అందుకే ఈ పాన్‌కేక్‌ రాక్స్‌ను వీక్షించడానికి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వాళ్లు నడిచి వెళ్లేందుకు వీలుగా చిన్న చిన్న దారులు కూడా ఉన్నాయి. సందర్శకులు ఇక్కడ ఫొటోలు, సెల్ఫీలతో తెగ సందడి చేస్తుంటారు. నేస్తాలూ మొత్తానికి ఈ ప్రకృతి వింత భలేగా ఉంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు