అయ్య బాబోయ్‌... రాక్షస తాబేలు!

హాయ్‌ ఫ్రెండ్స్‌! మీ అందరికీ తాబేళ్లంటే ఇష్టమే కదూ! అవి భలే ముద్దుగా అనిపిస్తాయి కదా! కానీ ఈ తాబేలు మాత్రం కాస్త భిన్నమైనది. ఇది చాలా భయంకరంగా ఉంటుంది.

Published : 19 Feb 2024 00:12 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌! మీ అందరికీ తాబేళ్లంటే ఇష్టమే కదూ! అవి భలే ముద్దుగా అనిపిస్తాయి కదా! కానీ ఈ తాబేలు మాత్రం కాస్త భిన్నమైనది. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. కాస్త ప్రమాదకరం కూడా! మరి ఇంతకీ ఈ తాబేలు పేరేంటి? ఇది ఎక్కడ ఉంటుంది? ఇంకా దీని ప్రత్యేకతలేంటి? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందామా!

డైనోసార్‌ యుగంనాటి జీవిలా కనిపిస్తున్న దీని పేరు ఎలిగేటర్‌ స్నాపింగ్‌ తాబేలు. మొసలికుండే పొలుసుల్లాంటి పెంకు కలిగి ఉండటం వల్లే దీనికి ఈ పేరు వచ్చింది. ఇది మంచినీటిలో జీవిస్తుంది. అమెరికాకు చెందిన జీవి. ఆ దేశంలోనే అతిపెద్ద మంచినీటి తాబేలు. దీని దవడలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఈ లక్షణమే ఎలిగేటర్‌ స్నాపింగ్‌ తాబేలును అత్యంత ప్రమాదకరంగా మార్చింది. ఇవి ఎక్కువగా ఫ్లోరిడా, టెక్సాస్‌, మిస్సోరి, ఇల్లినాయిస్‌, లూసియానాలో కనిపిస్తుంటాయి.

ఎంత బరువో...!

1937లో దాదాపు 187 కిలోల బరువున్న ఎలిగేటర్‌ స్నాపింగ్‌ తాబేలును గుర్తించారట. ఇప్పటి వరకు ఈ జాతిలో బరువు విషయంలో దీనిదే రికార్డు! చికాగోలో 113 కిలోలు, 107 కిలోలు, 135 కిలోలున్న వాటినీ కనుగొన్నారట. ఎలిగేటర్‌ స్నాపింగ్‌ తాబేళ్లు వాటి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. సర్వసాధారణంగా వీటి బరువు మాత్రం 21 కిలోల వరకు ఉంటుంది.

నాలుకే ఎర..

ఇది పూర్తిగా మాంసాహార తాబేలు. చేపలు, ఇతర తాబేళ్లను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుంది. కేవలం జలచరాలే కాకుండా కొన్నిసార్లు పక్షులు, ఎలుకలు, పాములు, ఇతర పురుగులనూ తినేసి తన బొజ్జ నింపుకుంటుంది. ఇది తన నోరును తెరిచిపెట్టి ఉంచి, నాలుకను కదిలిస్తూ ఉంటుంది. దీని నాలుక గులాబీరంగులో చిన్న పురుగులా కనిపిస్తుంది. దీన్ని ఆహారంగా భావించిన చేపల్లాంటి జీవులు దగ్గరకు రాగానే ఒక్కసారిగా తన దవడలను మూసేస్తుంది. అంతే ఇక జీవులు అస్సలు తప్పించుకోలేవు.

వేళ్లు భద్రం సుమా!

ఇవి పది నుంచి 50 వరకు గుడ్లను పెడతాయి. వరదల బారినపడకుండా ఉండేందు కోసం ఒడ్డుకు 50 గజాల దూరంలో నేలను తవ్వి అందులో గుడ్లను పెడతాయి. ఇందులోంచి పిల్లలు రావడానికి 100 నుంచి 140 రోజులు పడుతుంది. ఈ తాబేలు వల్ల మనుషుల ప్రాణాలకేమీ హాని లేదు. కానీ ఇది చాలా గట్టిగా కొరుకుతుంది. అందువల్ల వేళ్లు కూడా తెగిపోవచ్చు! అందుకే దీన్ని పట్టుకోవాలనుకోవడం చాలా ప్రమాదకరం. అయినప్పటికీ ఈ తాబేళ్లను కొందరు పెంచుకుంటూ ఉంటారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ఈ ఎలిగేటర్‌ స్నాపింగ్‌ తాబేలు విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని