ఎలుగుబంటిని కాదు...వరాహాన్ని అసలే కాదు!!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా?! ఏంటి నన్ను వింతగా చూస్తున్నారు. నా ముక్కేమో వరాహంలా..కాళ్లేమో ఎలుగుబంటిలా ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారు కదూ! నేను ఎలుగుబంటినీ కాదు.. వరాహాన్ని అసలే కాదు.

Published : 21 Feb 2024 00:04 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా?! ఏంటి నన్ను వింతగా చూస్తున్నారు. నా ముక్కేమో వరాహంలా..కాళ్లేమో ఎలుగుబంటిలా ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారు కదూ! నేను ఎలుగుబంటినీ కాదు.. వరాహాన్ని అసలే కాదు. నేను వేరే జీవిని! నా పేరేంటి, సంగతులేంటో తెలుసుకోవాలని మీకు తెగ ఆసక్తిగా ఉంది కదూ! ఆ వివరాలు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు గ్రేటర్‌ హాగ్‌ బ్యాడ్జర్‌. బలమైన శరీరం, పొడవైన మూతి నా సొంతం. నేను 8 నుంచి 12 కిలోల వరకు బరువు పెరుగుతాను. మాలో మళ్లీ మూడు రకాలున్నాయి. నేను ఎక్కువగా థాయ్‌లాండ్‌, ఆగ్నేయాసియా దేశాల్లో జీవిస్తుంటాను. భారతదేశంలో హరియాణా, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, అస్సోం, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోనూ కాస్త నా ఉనికి ఉంది. మాలో మగవాటిని బోర్స్‌ అని, ఆడవాటిని సోస్‌ అని పిలుస్తారు. మా గుంపును మాత్రం సీటే అంటారు.

అన్నీ తింటా..

నేను పగటి పూట బాగా చురుగ్గా ఉంటాను. పండ్లు, వేర్లను ఆహారంగా తీసుకుంటాను. అలా అని పూర్తి శాకాహారిని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. కుందేళ్లలాంటి చిన్న చిన్న జంతువులను కూడా తింటాను. మేం ఆహారాన్ని మా నివాస ప్రాంతాల్లోకి అస్సలు తీసుకెళ్లం. నివాసాలను శుభ్రంగా ఉంచుకోవాలని అనుకుంటాం. అందుకే దూరంగా తింటాం. మాకు చిరుతపులులు ప్రధాన శత్రువులు. ప్రస్తుతం మా సంఖ్య చాలా తక్కువగా ఉంది. వేట, వాతావరణ మార్పులు, అడవుల నరికివేతే దీనికి ప్రధాన కారణం. అందుకే మేం అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలో ఉన్నాం.

చాలా ప్రమాదకరం..

మేం చాలా ప్రమాదకర జీవులం. బలమైన శరీరం, గోర్లుండటంతో చాలా వేగంగా దాడి చేస్తాం. గాయాలపాలై ఉన్నప్పటికీ మేం ఎదురుదాడి చేసేందుకే ప్రయత్నిస్తాం. మా దవడలు కూడా బలంగా ఉంటాయి. మాలో చిన్నపిల్లల్ని తాకాలని చూడ్డం కూడా మీకు ప్రమాదమే. మేం దాదాపు 14 సంవత్సరాల వరకు జీవిస్తాం. వేగంగా బొరియలను తవ్వగలం. రాత్రిపూట కూడా చక్కగా చూడగలం. వినికిడి, వాసన పసిగట్టే శక్తి కూడా మాకు ఎక్కువ. మరో విషయం ఏంటంటే.. ఓ స్థాయి వరకు మేం విషాన్ని కూడా తట్టుకుని బతకగలం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ! ఇక ఉంటా మరి.. బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని